Prabhakaran: LTTE ప్రభాకరన్‌ బతికే ఉన్నారు.. త్వరలోనే బయటకొస్తారు: నెడుమారన్‌

ఎల్‌టీటీఈ అధినేత ప్రభాకరన్‌( LTTE chief Prabhakaran) మరణించినట్లు ప్రకటించిన 14 ఏళ్ల తర్వాత ఆయన గురించిన సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఆయన జీవించే ఉన్నట్లు తమిళనాడు నేత ఒకరు వెల్లడించారు. 

Updated : 13 Feb 2023 17:07 IST

తంజావుర్‌: ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్‌( LTTE chief Prabhakaran) జీవించి ఉన్నట్లు తమిళ జాతీయోద్యమ నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రజల కోసం ఆయన త్వరలో బయటకు వస్తారన్నారు. ఈ వ్యాఖ్యలు చేసింది పాళ నెడుమారన్‌(Pazha Nedumaran). ఆయన గతంలో కాంగ్రెస్‌ పార్టీలో పనిచేశారు. తంజావుర్‌లో మీడియాతో మాట్లాడుతూ ‘ప్రభాకరన్‌ సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నారు. త్వరలో బయటకు వస్తారు. తమిళ ఈలమ్ ప్రజలకోసం ప్రకటనలు చేయనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు ప్రకటించడానికి గల కారణాన్ని వివరించారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, రాజపక్స ప్రభుత్వం కూలిపోవడంతో ఆయన బయటకు వచ్చేందుకు అనుకూలమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రభాకరన్‌ను పెద్దపులిగా పిలిచేవారు.

ఎల్‌టీటీఈ(LTTE) కార్యకలాపాలకు వ్యతిరేకంగా అధినేత ప్రభాకరన్‌(Prabhakaran)ను హతమార్చినట్లు 2009లో శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఆయన మృతికి సంబంధించిన చిత్రాలు అప్పట్లో ప్రచురితమయ్యాయి. డీఎన్‌ఏ పరీక్షలతో సైతం అతడి మరణాన్ని ధ్రువీకరించినట్లు తెలిపింది. అయితే ఎల్‌టీటీఈని రూపుమాపే క్రమంలో శ్రీలంక ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు అప్పట్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఇక మరణించిన సమయంలో ప్రభాకరన్‌ వయస్సు 54. అతడు మరణించిన దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ తరహా ప్రకటన రావడం గమనార్హం. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని