తమిళనాడులో 9,10,11 తరగతుల పరీక్షలు రద్దు

కరోనా కారణంగా తమిళనాడులోని 9,10,11 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి గురువారం ప్రకటించారు.

Published : 25 Feb 2021 14:08 IST

అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి పళనిస్వామి

చెన్నై: కరోనా కారణంగా తమిళనాడులోని 9,10,11 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానేపై తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. వైద్యనిపుణుల సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన గురువారం అసెంబ్లీలో వివరించారు. దేశంలో కరోనా తీవ్రత పెరుగుతుండటంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా పరీక్షలు రద్దు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇంటర్నల్‌ పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా పబ్లిక్‌ పరీక్షల్లో మార్కులు నిర్ణయిస్తామన్నారు. అందులో 80శాతం మార్కులు త్రైమాసిక, అర్ధ సంవత్సర పరీక్షల ఆధారంగా లెక్కించి, మిగతా 20శాతం మార్కులు వారి హాజరు ఆధారంగా ఇస్తామని తెలిపారు. 12వ తరగతి పబ్లిక్‌ పరీక్షలు మే 3 నుంచి 21 వరకు జరగనున్నట్లు విద్యాశాఖ గతంలో తెలిపింది. కరోనా కారణంగా గతేడాది మార్చిలో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. అనంతరం 2021 జనవరిలో 10,12 విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి.

పదవీ విరమణ వయసు పెంపు..

త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి పళనిస్వామి మరో కీలక ప్రకటన చేశారు. ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును 59ఏళ్ల నుంచి 60ఏళ్లకు పెంచుతున్నట్లు ఆయన అసెంబ్లీలో ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని