Annamalai: ధైర్యముంటే నన్ను అరెస్టు చేయండి : అన్నమలై సవాల్‌

వలస కార్మికులపై (Migrant Workers) దాడులకు డీఎంకే నేతల వ్యాఖ్యలే కారణమంటూ తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నమలై (Annamalai) చేసిన వ్యాఖ్యలకు ఆయనపై కేసు నమోదయ్యింది. తప్పుడు కేసులు అనైతికం అన్న ఆయన.. ధైర్యముంటే తనను అరెస్టు చేయాలని సవాల్‌ విసిరారు.

Published : 06 Mar 2023 01:38 IST

చెన్నై: ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మిలకులపై (Migrant Workers) దాడులు జరుగుతున్నాయంటూ సోషల్‌ మీడియాలో (Social Media) వదంతులను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయని.. అందుకు అధికార డీఎంకే పార్టీనే బాధ్యత వహించాలని తమిళనాడు భాజపా (BJP) విభాగం ఆరోపించింది. అయితే, వదంతులను తీవ్రంగా పరిగణిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నమలై (Annamalai)పై కేసు నమోదు చేసింది. వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం, హింసకు ప్రేరేపించారనే ఆరోపణలపై తమిళనాడు సైబర్‌ క్రైం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

మరోవైపు భాజపా రాష్ట్ర అధ్యక్షుడితోపాటు బిహార్‌లో భాజపా ట్విటర్‌ అకౌంట్‌ నిర్వహిస్తున్న వారిపైనా కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే, దాడులు జరిగాయంటూ సోషల్‌ మీడియాలో ఫేక్‌ న్యూస్‌ రావడం బాధ కలిగించిందని అన్నమలై (Annamalai) పేర్కొన్నప్పటికీ.. ఉత్తర భారతీయులపై డీఎంకే ఎంపీలు ఇదివరకు చేసిన వ్యాఖ్యలే తాజా పరిస్థితికి కారణమంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ముఖ్యంగా ‘పానీపూరీ వాలా’ అంటూ డీఎంకే మంత్రులు వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

ధైర్యముంటే అరెస్టు చేయండి..

వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయని వచ్చిన వదంతులపై స్పందించినందుకు తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నమలై ఆరోపించారు. ఈ తరుణంలో ధైర్యముంటే ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం తనను 24 గంటల్లో అరెస్టు చేయాలంటూ సవాల్‌ విసిరారు. ‘తప్పుడు కేసులు నమోదు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అణచివేయవచ్చని మీరు (డీఎంకే ప్రభుత్వం) భావిస్తున్నారు. ఓ సాధారణ పౌరుడిగా.. మీకు 24 గంటలు సమయం ఇస్తున్నా.  సాధ్యమైతే నన్ను తాకండి’ అంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా డీఎంకే నేతలు గతంలో మాట్లాడిన వీడియోను సైతం పోస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని