MK Stalin: సిటీ బస్సు ఎక్కిన సీఎం.. ఆనందంలో ప్రయాణికులు

ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌. తాజాగా ఆయన ఆర్టీసీ

Updated : 23 Oct 2021 17:16 IST

చెన్నై: ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌. తాజాగా ఆయన ఆర్టీసీ బస్సులో కొంతసేపు ప్రయాణించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. 

రాష్ట్రంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు శనివారం ఆయన చెన్నైలోని కన్నాగి ప్రాంతంలో గల ఓ వ్యాక్సిన్‌ కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఆరోగ్య సిబ్బంది, టీకా తీసుకునేవారితో మాట్లాడి తిరుగుప్రయాణం అయ్యారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సును చూసి సీఎం తన కాన్వాయ్‌ ఆపి  బస్సెక్కారు. ఈ అనూహ్య పరిణామంతో బస్సులోని డ్రైవరు, కండక్టర్‌, ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ముఖ్యమంత్రిని చూసిన సంతోషంలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.

బస్సులో ఆకస్మిక తనిఖీ చేపట్టిన స్టాలిన్‌.. ఆర్టీసీ సౌకర్యాలపై ప్రజలను ఆరా తీశారు. బస్సులు సమయానికి వస్తున్నాయా? మహిళలకు ఉచిత టికెట్లు సరిగ్గానే ఇస్తున్నారా?ఉచిత టికెట్ల వల్ల ప్రయోజనం ఉందా? అని వారిని అడిగి తెలుసుకున్నారు. బస్సులో కొంతమంది మాస్క్‌లు పెట్టుకోకపోతే వారిని మాస్క్‌లు ధరించాలని సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియోను తమిళనాడు సీఎంవో కార్యాలయం ట్విటర్‌లో షేర్‌ చేయగా.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. తమిళనాడులో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ స్టాలిన్‌ ప్రభుత్వం ఆ మధ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని