Pawan Kalyan: తమిళనాడు అసెంబ్లీలో పవన్‌ కల్యాణ్‌ ‘ట్వీట్‌’ ప్రస్తావన..

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పనితీరును ప్రశంసిస్తూ పవన్‌ కల్యాణ్‌ చేసిన ట్వీట్‌, ప్రముఖ నటుడు చిరంజీవి, స్టాలిన్‌ భేటీపై ఆ రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగింది.

Updated : 03 Sep 2021 14:59 IST

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పనితీరును ప్రశంసిస్తూ పవన్‌ కల్యాణ్‌ చేసిన ట్వీట్‌, ప్రముఖ నటుడు చిరంజీవి, స్టాలిన్‌ భేటీపై ఆ రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగింది. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్‌ తన ప్రసంగంలో ఈ విషయాల్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా పవన్‌ ట్వీట్‌ను తమిళనాడు మంత్రి తెలుగులో చదివి వినిపించడం విశేషం. తోటి సభ్యులకు అర్థమయ్యేలా ఈ ట్వీట్‌ను తెలుగులో చదువుతూ తమిళంలో తర్జుమా చేసి చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. దీన్ని నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

తమిళనాడు సీఎం స్టాలిన్‌ను అభినందిస్తూ ఇటీవల పవన్‌ కల్యాణ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ‘‘ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి.. కానీ అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, ప్రభుత్వ పనితీరు మీ ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశంలోని రాష్ట్రాలకు, అన్ని పార్టీలకు మార్గదర్శకం.. స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని ట్వీట్‌లో పవన్‌ పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా.. గత బుధవారం నటుడు చిరంజీవి.. స్టాలిన్‌తో భేటీ అయ్యారు. చెన్నైలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ‘స్టాలిన్‌ను కలవడం సంతోషంగా ఉంది. ఆయన తీసుకున్న పలు ఉన్నతమైన నిర్ణయాలతో గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదిగారు. కరోనా కాలంలో మెరుగైన పాలన అందిస్తున్నారని అభినందనలు తెలిపాను’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని