Viral Video: ఉదయనిధి స్టాలిన్‌ సమక్షంలోనే పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి

సేలంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర యువజన శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో కరచాలనం చేసేందుకు ప్రయత్నించిన పార్టీ కార్యకర్తను మరో మంత్రి కేఎన్‌ నెహ్రూ మెడపట్టి నెట్టేసిన వీడియో వైరల్‌గా మారింది.

Published : 28 Jan 2023 01:25 IST

చెన్నై: తమిళనాడులో అధికార పార్టీ నేతలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం కూర్చుకునేందుకు కుర్చీ తీసుకురాలేదని పార్టీ కార్యకర్తలపై రాష్ట్ర మంత్రి ఎస్‌ఎం నాజర్‌ రాయి విసిరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మంత్రి కేఎన్‌ నెహ్రూ పార్టీ కార్యకర్తను మెడపట్టి నెట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 

సేలంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర యువజన శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ పార్టీ కార్యకర్తలను కలిసేందుకు స్టేజ్‌పై నిల్చుని ఉన్నారు. కార్యకర్తలు వరుసలో వస్తూ ఆయన్ను కలిసి వెళుతున్న క్రమంలో ఓ కార్యకర్త ఉదయనిధి స్టాలిన్‌తో కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న మున్సిపల్‌శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ ఆ కార్యకర్తను మెడ పట్టి తోసేసిన వీడియోలో రికార్డయింది. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తమిళనాడు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ‘‘ ఈ డీఎంకే మంత్రి ప్రజల్ని కొడతాను అని ప్రమాణం చేసినట్లున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ మంత్రి రాళ్లు విసిరారు. తాజాగా మరో మంత్రి ప్రజల్ని తోసేస్తున్నారు. వీళ్లకు ఇది రోజువారీ కార్యక్రమంలా మారింది. మంత్రులను కాపాడుకునేందుకు ప్రజలకు రక్షణ కవచాలు అందించాలని తమిళనాడు ముఖ్యమంత్రిని కోరుతున్నా’’ అని అన్నామలై ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు, ప్రతిపక్ష పార్టీ నాయకులు మంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని