Uttarakhand: సెలవులో ఉన్న టీచర్లకు రిటైర్మెంట్‌..! ఉత్తరాఖండ్‌ కీలక నిర్ణయం

సుదీర్ఘ కాలం సెలవుల్లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు తప్పనిసరి పదవీ విరమణ ఇచ్చేలా ఉత్తరాఖండ్‌ (Uttarakhand) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. 

Published : 10 Jun 2023 11:30 IST

దేహ్రాదూన్‌: ప్రభుత్వ ఉపాధ్యాయులకు (Govt Teachers) సంబంధించి ఉత్తరాఖండ్‌ (Uttarakhand) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విధులకు హాజరుకాకుండా సుదీర్ఘకాలం సెలవులో ఉన్న టీచర్లతో పదవీ విరమణ (Retirement) చేయించనుంది. వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ధన్‌ సింగ్‌ రావత్‌ ఇటీవల ప్రకటించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. 

ఆరు నెలలు అంతకంటే ఎక్కువ కాలం నుంచి స్కూళ్లకు రాకుండా విధుల నుంచి తప్పించుకుంటున్న ఉపాధ్యాయుల జాబితాను తయారుచేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇలాంటి వారు దాదాపు 150 మంది ఉన్నారని, వారందరితో పదవీ విరమణ చేయించాలని సర్కారు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. జాబితా పూర్తయిన తర్వాత వారికి రిటైర్మెంట్‌ ఇచ్చి.. కొత్త నియామకాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

కొండల ప్రాంతంలో ఉన్న జిల్లాల్లో నియామకాలు పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో చాలా మంది విధులకు రావట్లేదట. రాకపోకలు ఇబ్బందిగా ఉన్నాయని చెబుతూ చాలా మంది దీర్ఘకాల సెలవులను తీసుకుంటున్నట్లు విద్యాశాఖ అధికారిక వర్గాలు తెలిపాయి. కొందరైతే ‘జీతం లేని సెలవుల’ ఆప్షన్‌ కింద సంవత్సరాల తరబడి విధులకు గైర్హాజరవుతున్నట్లు తేలింది. అయితే ఇలా సుదీర్ఘకాలం సెలవుల్లో ఉన్న వారికి స్వచ్ఛంద పదవీ విరమణ సదుపాయం ఉన్నప్పటికీ.. చాలా మంది రిటైర్మెంట్ తీసుకోకుండానే సెలవులను కొనసాగిస్తున్నారట. ఇది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుండటంతో ఈ తప్పనిసరి రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని