SpiceJet: మరో స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక లోపం..

స్పైస్‌జెట్‌ సంస్థకు చెందిన ఓ విమానం ఇటీవల గాల్లో భారీ  కుదుపులకు లోనై ప్రయాణికులు గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విమానయాన సంస్థకు చెందిన మరో విమానంలో సాంకేతికలోపం తలెత్తింది

Published : 04 May 2022 18:49 IST

చెన్నై: స్పైస్‌జెట్‌ సంస్థకు చెందిన ఓ విమానం ఇటీవల గాల్లో భారీ  కుదుపులకు లోనై ప్రయాణికులు గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విమానయాన సంస్థకు చెందిన మరో విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో ఆ విమానం ఎయిర్‌పోర్టుకు తిరిగొచ్చింది.

మంగళవారం రాత్రి చెన్నై విమానాశ్రయం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు బయల్దేరిన స్పైస్‌జెట్‌ బోయింగ్‌ బి737-8 మ్యాక్స్‌ విమానంతో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్‌ అయిన 15 నిమిషాల తర్వాత ఇంజిన్‌లో సమస్యను గుర్తించిన పైలట్‌ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్‌పోర్టులో పరిశీలన అనంతరం విమానం ఆరున్నర గంటలు ఆలస్యంగా దుర్గాపూర్‌ బయల్దేరినట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా.. ముంబయి నుంచి కిషన్‌గఢ్‌ వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌ ఎస్‌జీ 2871 విమానంలోనూ నిన్న సాంకేతిక లోపాన్ని గుర్తించారు. విమానాశ్రయంలోనే ఈ సమస్య తలెత్తగా.. విమానం టేకాఫ్‌ అవలేదు. దీంతో ప్రయాణికులను మరో విమానంలో పంపించారు. కాగా.. వారం వ్యవధిలో మూడు స్పైస్‌జెట్‌ విమానాల్లో సాంకేతిక సమస్యలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు.

ఇటీవల ముంబయి నుంచి దుర్గాపూర్‌ బయల్దేరిన స్పైస్‌జెట్ విమానం ఒకటి భారీ కుదుపులకు లోనైంది. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కుదుపుల కారణంగా ప్రయాణికుల వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇవి కొందరి తలలపై పడటంతో ప్రయాణికులు గాయాలపాలయ్యారు. విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని