WHO Chief: నమస్కారం పెట్టిన టెడ్రోస్.. నవ్వుతూ చప్పట్లు కొట్టిన మోదీ..!

గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్‌ అథనామ్ వీక్షకులకు చిన్నపాటి సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Updated : 20 Apr 2022 12:03 IST

జామ్‌నగర్‌: గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్‌ అథనామ్ వీక్షకులకు చిన్నపాటి సర్‌ప్రైజ్ ఇచ్చారు. జామ్‌నగర్‌లో ఆరోగ్య సంస్థకు చెందిన సంప్రదాయ వైద్య అంతర్జాతీయ కేంద్ర భవనం ప్రారంభ సమయంలో ఆయన గుజరాతీలో మాట్లాడి ఆశ్చర్యపర్చారు. ఆయన మాటలకు అక్కడే ఉన్న ప్రధాని మోదీ చిరునువ్వులు చిందిస్తూ, చప్పట్లు కొడుతూ కనిపించారు.

తన ప్రసంగాన్ని ప్రారంభించేముందు టెడ్రోస్ అక్కడ హాజరైనవారందరికీ రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి పలకరించారు. ‘అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు?’ అంటూ గుజరాతీ భాషలో మాట్లాడి ఆకట్టుకున్నారు. వెంటనే ప్రజల కేరింతలతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. పక్కనే ఉన్న ప్రధాని ఆయన మాటలకు చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈ అంతర్జాతీయ కేంద్రంతో సంప్రదాయ వైద్యంలో ఓ నూతన శకం ప్రారంభం కానుందని అన్నారు. రానున్న 25 ఏళ్లలో ఈ కేంద్రం ప్రపంచ మానవాళికి దగ్గర కానుందని.. ప్రజల జీవితాల్లో కీలక భాగం కానుందని పేర్కొన్నారు. భారతీయ ప్రాచీన విజ్ఞాన సంపద గురించి ప్రస్తావించారు. ఆయుర్వేద, ఇతర సంప్రదాయ వైద్యాలు కేవలం చికిత్సా విధానాలు మాత్రమే కావని.. అవి భారతీయుల సమగ్ర జీవన విధానానికి ప్రతిబింబాలని పేర్కొన్నారు. తృణధాన్యాల ప్రాధాన్యతనూ ప్రధాని వివరించారు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని