వచ్చే ఏడాది తేజస్‌ మార్క్‌-2 సిద్ధం

దేశీయ యుద్ధవిమానం ‘తేజస్‌’కు సంబంధించిన మరింత శక్తిమంతమైన రూపాన్ని వచ్చే ఏడాది సిద్ధం చేస్తామని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఛైర్మన్‌ ఆర్‌.మాధవన్‌ తెలిపారు....

Published : 01 Feb 2021 09:34 IST

శక్తిమంతమైన ఇంజిన్, ఆయుధాలు, ఆధునిక వ్యవస్థలు దీని సొంతం 
2025 నుంచి ఉత్పత్తి
హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ ఛైర్మన్‌ వెల్లడి 

దిల్లీ: దేశీయ యుద్ధవిమానం ‘తేజస్‌’కు సంబంధించిన మరింత శక్తిమంతమైన రూపాన్ని వచ్చే ఏడాది సిద్ధం చేస్తామని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఛైర్మన్‌ ఆర్‌.మాధవన్‌ తెలిపారు. తేజస్‌ మార్క్‌-2గా పిలిచే ఈ లోహ విహంగంలో శక్తిమంతమైన ఇంజిన్, ఎక్కువ ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం, కొత్త తరం ఎలక్ట్రానిక్‌ పోరాట వ్యవస్థ, అత్యాధునిక ఏవియానిక్స్‌ వంటివి ఉంటాయని చెప్పారు. ఈ యుద్ధవిమాన ఆకృతికి సంబంధించిన పని శరవేగంగా జరుగుతోందని తెలిపారు. 2025 నుంచి ఈ జెట్‌ల ఉత్పత్తి ప్రారంభం కావొచ్చని వివరించారు. 

ఈ యుద్ధవిమానానికి సంబంధించిన మునుపటి వెర్షన్‌ తేజస్‌ మార్క్‌-1ఎ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సమ్మతి తెలిపిన సంగతి తెలిసిందే. రూ.48వేల కోట్లతో 83 జెట్‌లను హెచ్‌ఏఎల్‌ సరఫరా చేస్తుంది. తేజస్‌ మార్క్‌-2 మరింత శక్తిమంతమైందని మాధవన్‌ చెప్పారు. దీని పొడవు ఎక్కువగా ఉంటుందని, ఎక్కువ దూరం ప్రయాణించగలదని తెలిపారు. దీని నిర్వహణ కూడా సులువని పేర్కొన్నారు. ఇందులో మరింత మెరుగైన నెట్‌వర్క్‌ కేంద్రీకృత యుద్ధ వ్యవస్థలు ఉంటాయన్నారు. ‘‘తేజస్‌ మార్క్‌-2.. వచ్చే ఆగస్టు-సెప్టెంబరులో సిద్ధమయ్యే అవకాశం ఉంది. అయితే దాని తొలి గగనవిహారానికి కొంత సమయం పడుతుంది. మొదటి హై స్పీడ్‌ పరీక్ష 2023లో ప్రారంభం కావొచ్చు’’ అని ఆయన చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తేజస్‌ మార్క్‌-2లో అమర్చే ఆయుధాలపై తర్వాతి దశలో నిర్ణయం ఉంటుందన్నారు. తేజస్‌.. బహుళ ప్రయోజన సూపర్‌సోనిక్‌ యుద్ధవిమానం. ముప్పు తీవ్రంగా ఉండే శత్రు గగనతలాల్లో పోరాడే సత్తా దీనికి ఉంది. గాల్లో పోరాటం, శత్రువుపై ఎదురుదాడి, నిఘా, నౌకా విధ్వంసక సామర్థ్యం దీని సొంతం.  

‘ఐదోతరం’ పైనా కసరత్తు
ఐదోతరం యుద్ధవిమానం ‘అడ్వాన్స్‌డ్‌ మల్టీరోల్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌’ (ఆమ్కా) ప్రాజెక్టుపై కసరత్తు చేస్తున్నామని మాధవన్‌ చెప్పారు. అది ప్రాథమిక డిజైన్‌ దశలో ఉందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం హెచ్‌ఏఎల్, డీఆర్‌డీవో, ప్రైవేటు సంస్థలతో కలిసి ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్‌పీవీ)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇది ప్రభుత్వ సంస్థగా మారకుండా చూసేందుకు ప్రైవేటు సంస్థలకు 50.5 శాతం వాటా ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. ‘ఆమ్కా’ మొదటి యుద్ధవిమానం 2026 కల్లా సిద్ధమయ్యే అవకాశం ఉందన్నారు. అన్ని పరీక్షలు పూర్తి చేసుకొని 2030 నుంచి ఉత్పత్తి దశకు చేరే వీలుందని తెలిపారు. 

ఇవీ చదవండి...

ఒత్తిడితో ఒప్పందానికి ఒప్పుకోం

వీగర్‌లపై చైనా మరోసారి ఉక్కుపాదం!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని