కొత్త కార్లు కొనొద్దు.. పాదాలకు నమస్కరిస్తే చూస్తూ ఉండొద్దు: తేజస్వి

బిహార్‌లో ఆర్జేడీ పొత్తుతో నీతీశ్‌ కుమార్(జేడీయూ) నేతృత్వంలో ఇటీవలే కొత్త ప్రభుత్వం ఏర్పడింది.

Published : 20 Aug 2022 14:56 IST

పట్నా: బిహార్‌లో ఆర్జేడీ పొత్తుతో నీతీశ్‌ కుమార్ (జేడీయూ) నేతృత్వంలో ఇటీవలే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. సుమారు 30 మంది మంత్రివర్గంలో చేరారు. వీరిని ఉద్దేశిస్తూ.. ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కొన్ని సూచనలు చేశారు. ‘ఇలా ప్రవర్తించాలి.. అలా చేయొద్దు’ అంటూ తన ఆర్జేడీ మంత్రులకు ఒక నియమావళిని సిద్ధం చేశారు.

‘పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వండి. బొకేలకు బదులు పుస్తకాలు, పెన్నులు ఇచ్చేలా చూడండి. ఆర్జేడీ నుంచి ఎన్నికైన మంత్రులు వారికోసం వాహనాలు కొనుగోలు చేయొద్దు. మంత్రులంతా ప్రతి ఒక్కరితో మర్యాదగా ప్రవర్తించాలి. నమస్తే, అదాబ్ చెప్తూ.. మన సంప్రదాయాన్ని ప్రోత్సహించాలి. కార్యకర్తలు, మద్దతుదారులు పాదాలను నమస్కరించడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించొద్దు. ప్రజల సమస్యలు పరిష్కరించే విషయంలో కులం, మతం ప్రాతిపదిక కావొద్దు. అలాగే మంత్రులు తమ విధులకు సంబంధించి ప్రణాళికను, అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలి. దాంతో ప్రజలకు మన నుంచి సానుకూల సమాచారం అందుతుంది’ అని తన మంత్రులకు తేజస్వి దిశా నిర్దేశం చేశారు. 

ఆర్జేడీ విషయంలో భాజపా చేస్తున్న ఆటవిక రాజ్యం విమర్శలను తిప్పికొట్టేందుకు, పార్టీకి ప్రజల్లో మంచి పేరు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంగా ఈ సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఓ స్వతంత్ర అభ్యర్థి కూడా ఆర్జేడీ, జేడీయూ కూటమిలో చేరడంతో ఎమ్మెల్యేల సంఖ్యా బలం 164కు పెరిగింది. ఈ సంకీర్ణ ప్రభుత్వం ఆగస్టు 24న బలపరీక్షను ఎదుర్కోనుంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు