Mu, C.1.2 Variants: భారత్‌లో ఈ వేరియంట్ల జాడల్లేవ్‌..!

ప్రమాదకరంగా భావిస్తోన్న Mu, C.1.2 రకాలు ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఇప్పటివరకు ఈ రెండు రకాలు భారత్‌లో వెలుగు చూడలేదని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన కన్సార్టియం INSACOG వెల్లడించింది.

Published : 15 Sep 2021 22:23 IST

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కన్సార్టియం వెల్లడి

దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త వేరియంట్లు వెలుగు చూస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రమాదకరంగా భావిస్తోన్న Mu, C.1.2 రకాలు ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఇప్పటివరకూ ఈ రెండు రకాలు భారత్‌లో వెలుగు చూడలేదని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన జీనోమ్‌ కన్సార్టియం INSACOG వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఆందోళనకరమైన డెల్టా వేరియంట్‌తోపాటు దాని ఉపరకాల ప్రభావమే అధికంగా ఉందని పేర్కొంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన C.1.2 రకం మనదేశంలో బయటపడనప్పటికీ అంతర్జాతీయ ప్రయాణికుల్లో వైరస్‌ సోకిన వారికి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టేందుకు ఇప్పటికే ఉన్న సిఫార్సులను కచ్చితంగా అమలు చేయాలని INSACOG స్పష్టం చేసింది.

ఆ రెండు దేశాల్లోనే ఎక్కువ..!

ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా బయటపడుతున్న కరోనా వేరియంట్ల తీవ్రతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వాటి సంక్రమణ రేటు, తీవ్రత ఆధారంగా వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (VOI), వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌ (VOC)గా ప్రకటిస్తోంది. ఈ మధ్య కొత్తగా వెలుగు చూసిన Mu (B.1.621)తో పాటు C.1.2లను ప్రస్తుతానికి ఆందోళనకరం కాని (VOI) వేరియంట్లుగానే ప్రకటించింది. అయితే, Mu ప్రాబల్యం ప్రపంచవ్యాప్తంగా తక్కువే ఉందని.. ప్రస్తుతం వీటి తీవ్రత 0.1శాతానికి తగ్గినట్లు పేర్కొంది. అత్యధికంగా కొలంబియాలో 39శాతం, ఈక్వెడార్‌లో 13శాతం కేసుల్లో వీటి ప్రభావం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదిలాఉంటే, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ గుర్తించిన ఆందోళనకర వేరియంట్లతో పోలిస్తే కొత్తగా వెలుగు చూసిన C.1.2 రకం ఎన్నో ఎక్కువ మ్యుటేషన్లకు గురైనట్లు పరిశోధకులు గుర్తించారు. బీటా, డెల్టా వేరియంట్ల మాదిరిగానే వీటి మ్యుటేషన్‌లో పెరుగుదల కనిపిస్తోందని పేర్కొన్నారు. ఇతర రకాల మ్యుటేషన్‌ రేటుతో పోలిస్తే దాదాపు రెట్టింపు వేగంతో (ఏడాదికి 41.8 మ్యుటేషన్లు) మార్పులు చెందుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. యాంటీబాడీలను తప్పించుకునే గుణం కూడా C.1.2 సీక్వెన్సుల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక వీటికితోడు టీకాల వల్ల వచ్చే యాంటీబాడీలను ఏమార్చే గుణం మరో ప్రమాదకరమైన Mu రకానికి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే, వీటి ప్రాబల్యం, తీవ్రతపై పరిశోధనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వీటిని వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌గానే ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని