sprinter Man Kaur: పరుగుల బామ్మ మన్‌ కౌర్‌ ఇకలేరు 

వయసు సెంచరీ దాటినా.. ఎంతో ఉత్సాహంగా పరుగులు పెడుతూ ఎన్నో జాతీయ, అంతర్జాతీయ రికార్డులు సాధించిన పరుగుల బామ్మ మన్‌ కౌర్‌ కన్నుమూశారు

Published : 31 Jul 2021 18:27 IST

చండీగఢ్‌: వయసు సెంచరీ దాటినా.. ఎంతో ఉత్సాహంగా పరుగులు పెడుతూ ఎన్నో జాతీయ, అంతర్జాతీయ రికార్డులు సాధించిన పరుగుల బామ్మ మన్‌ కౌర్‌ కన్నుమూశారు. శనివారం ఉదయం ఆమె గుండెపోటు రావడంతో చండీగఢ్‌లోని ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం ఆమె తుది శ్వాస విడిచినట్లు మన్‌ కౌర్‌ కుమారుడు గుర్‌దేవ్‌ సింగ్‌ తెలిపారు. ‘మిరాకిల్ మామ్‌ ఫ్రమ్‌ చండీగఢ్‌’గా పేరొందిన మన్‌ కౌర్‌ వయసు 105 ఏళ్లు. 1916 మార్చిలో జన్మించిన ఆమె.. తన 93 ఏళ్ల వయసులో అథ్లెట్‌గా మారారు. అనేక జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని 20కి పైగా పతాకాలను గెలుచుకున్నారు.

 సాధారణంగా వయసులో పెద్దవాళ్లకి వరల్డ్‌ మాస్టర్‌ గేమ్స్‌ పేరుతో పోటీలు నిర్వహిస్తుంటారు. కొన్నేళ్ల కిందట ఈ పోటీల గురించి తెలుసుకున్న మన్‌ కౌర్‌ కుమారుడు తన తల్లిని ప్రోత్సహించారు. ఇంత వయసులోనూ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని మన్‌ కౌర్‌ కూడా పోటీలకు ఆసక్తి చూపించారు. దీంతో కొడుకే కోచ్‌లా మారి శిక్షణ ఇచ్చారు. అలా ఆమె అథ్లెట్‌గా మారారు. 2017లో న్యూజిలాండ్‌లో జరిగిన వరల్డ్‌ మాస్టర్స్‌ గేమ్స్‌లో 100మీటర్ల పరుగును 74 సెకన్లలో పూర్తి చేసి అంతకుముందున్న 81 సెకన్ల రికార్డును బద్దలు కొట్టారు. దీంతో ఆమె పేరు మార్మోగింది. 

ఆ తర్వాత 200మీటర్ల విభాగంలోనూ గెలిచి బంగారు పతకం అందుకున్నారు. మన్‌ కౌర్‌కి జావెలిన్‌ త్రో, షాట్‌పుట్‌లోనూ ప్రావీణ్యం ఉంది. 2020లో మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా నారీశక్తి పురస్కారం కూడా అందుకున్నారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా సంతాపం తెలిపారు. పది పదుల వయసులోనూ ఎంతో చురుగ్గా పరుగులు పెట్టిన మన్‌ కౌర్‌ నేటి తరానికి ఎంతో ఆదర్శమని కొనియాడారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని