పార్లమెంట్‌లో ఈరోజు.. కేంద్రం సమాధానాలివే..!

కొవిడ్ నిబంధనల మధ్య.. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో విపక్షాల ప్రశ్నలు.. వాయిదాల పర్వం మధ్యలో కేంద్ర ప్రభుత్వం సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఆ విషయాలు ఏంటంటే..

Published : 20 Jul 2021 18:18 IST

దిల్లీ: కొవిడ్ నిబంధనల మధ్య.. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో విపక్షాల ప్రశ్నలు.. వాయిదాల పర్వం మధ్యలో కేంద్ర ప్రభుత్వం సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఆ విషయాలు ఏంటంటే..

కొవిడ్ నివారణకు రూ.40వేల కోట్లు..

కొవిడ్ కట్టడికి కేంద్రం భారీ ఎత్తున నిధులు కేటాయించింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద కేటాయించిన నిధులతో పాటు కొవిడ్ నివారణ, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.40వేల కోట్లను ఆమోదించింది. భాజపా సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో ఈ సమాధానం ఇచ్చారు. అలాగే జులై 16 నాటికి ఔషధ సంస్థ భారత్‌ బయోటెక్ నుంచి 5.45 కోట్ల కొవాగ్జిన్‌ డోసులను అందుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. జులై చివరినాటికి 8 కోట్ల డోసులు సరఫరా చేసేలా బయోటెక్‌కు ఆర్డర్ ఇచ్చామని చెప్పింది. త్వరలో ఈ ఔషధ సంస్థ తన టీకా ఉత్పత్తిని నెలకు 5.8 కోట్ల డోసులకు పెంచనుంది. ఈ విషయాన్ని కేంద్రం సభకు తెలిపింది.

80 మంది మృతి.. 204 మంది జాడలేదు..

ఫిబ్రవరి నెలలో ఉత్తరాఖండ్‌లో సంభవించిన జలవిలయం ఎంతటి బీభత్సాన్ని సృష్టించిందో అందరికీ గుర్తే ఉంటుంది. ఈ ఘటనలో 80 మంది మరణించారని, 204 మంది జాడ కనిపించకుండా పోయిందని కేంద్రం లోక్‌సభలో కేంద్రం వెల్లడించింది. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా జోషిమఠ్‌ సమీపంలో నందాదేవీ హిమానీ నదంలోని పెద్ద మంచుచరియలు విరిగి ధౌలీగంగ నదిలో పడడంతో హఠాత్తుగా భారీ వరదలు సంభవించిన సంగతి తెలిసిందే.  

అక్రమ వలసదారులతో భద్రతకు ముప్పు...

‘అక్రమ వలసదారులు (రోహింగ్యాలతో సహా) దేశ భద్రతకు ముప్పు కలిగిస్తున్నారు. కొంతమంది రోహింగ్యాలు చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడినట్లు నివేదికలున్నాయి’ అని అంటూ కేంద్రం లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేసింది. చెల్లుబాటయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించే విదేశీ పౌరులు లేక భారత్‌లో ఉన్న సమయంలో గడువుతీరిన ప్రయాణ పత్రాలు కలిగిన వ్యక్తుల్ని అక్రమ వలసదారులుగా పరిగణిస్తారని చెప్పింది. 

ఇక, ప్రస్తుతం దేశంలో నాలుగు కొవిడ్ టీకాలు క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయని, ఒకటి ప్రి-క్లినికల్ ట్రయల్స్‌ దశలో ఉందని కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని