
CBSE: వివాదాస్పద అంశాన్ని తొలగించిన సీబీఎస్ఈ.. ఆ ప్రశ్నకు ఫుల్ మార్కులు!
విమర్శల నేపథ్యంలో చర్యలు చేపట్టిన సీబీఎస్ఈ
దిల్లీ: తాజాగా జరిగిన సీబీఎస్ఈ పదోతరగతి ఇంగ్లీష్ పరీక్ష ప్రశ్నాపత్రంలో మహిళా సమానత్వాన్ని దెబ్బతీసేలా పలు అంశాలు ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నిపుణుల సిఫార్సు మేరకు అభ్యంతరకరమైన ప్రశ్నను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
‘ఇంగ్లీష్ పశ్నాపత్రంలో ఇచ్చిన ప్యాసేజీ బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదంటూ కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ అంశాన్ని విషయ నిపుణుల పరిశీలనకు పంపాము. వారి సిఫార్సు మేరకు ప్యాసేజీ 1తోపాటు దానికి అనుబంధంగా ఇచ్చిన ప్రశ్నలను తొలగించాలని నిర్ణయించాం. ఆ ప్రశ్నకు సంబంధించి విద్యార్థులందరికీ పూర్తి మార్కులు ఇస్తాం’ అని సీబీఎస్ఈ ప్రకటించింది. ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలోని ప్యాసేజ్ 1కు సంబంధించి కేవలం JSK/1 సిరీస్ ప్రశ్నాపత్రం వచ్చిన వారికే కాకుండా అన్ని సిరీస్‌ల వారికి పూర్తి మార్కులు కేటాయిస్తామని స్పష్టం చేసింది.
అంతకుముందు.. సీబీఎస్ఈ పదోతరగతి ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ఓ కాంప్రహెన్షన్ ప్యాసేజీలో పలు అంశాలు మహిళా సమానత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంటూ పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ‘మహిళా విమోచనం వల్ల పిల్లలపై తల్లిదండ్రుల అదుపాజ్ఞలు దెబ్బతింటున్నాయి’, భర్త అడుగుజాడల్లో నడవడం ద్వారానే ఒక తల్లి తన పిల్లల నుంచి విధేయత వంటివాటిని పొందగలుగుతుంది’ వంటి అంశాలున్నాయి. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు, రాజకీయ పార్టీల నుంచి విమర్శలకు కారణమయ్యింది. ఈ ప్రశ్నాపత్రం అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. కేంద్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే విషయానికి నిరసనగా డీఎంకే, ఎన్సీపీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌తో పాటు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కూడా లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.