
UNSC: ఉగ్రవాదానికి చోటివ్వొద్దు.. అఫ్గాన్‌పై ఐరాస భద్రతమండలి తీర్మానం
తాలిబన్లు మాట నిలబెట్టుకోవాలి
భారత్ అధ్యక్షతన సమావేశం
ఐరాస: అఫ్గాన్ విషయంలో ఐక్యరాజ్య సమితి భద్రతమండలి మంగళవారం దృఢ తీర్మానం చేసింది. అఫ్గానిస్థాన్ తన భూభాగాన్ని ఇతర దేశాలను భయాందోళనలకు గురిచేయడానికి, ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడానికి, వారికి శిక్షణ ఇవ్వడానికి, ఆర్థిక తోడ్పాటు అందించడానికి, ఉగ్ర దాడులకు ప్రణాళికలు రూపొందించడానికి ఉపయోగించరాదని విస్పష్టం చేసింది. అఫ్గాన్లు, విదేశీయులు సురక్షితంగా దేశం విడిచి వెళ్లేందుకు సహకరిస్తామంటూ ఇచ్చిన హామీని తాలిబన్ నిలబెట్టుకోవాలని మండలి పేర్కొంది. తాలిబన్ల దురాక్రమణ క్రమంలోనే, ఐసిస్-కె ఉగ్రవాదులు కాబుల్ విమానాశ్రయం వద్ద దాడులకు పాల్పడిన నేపథ్యంలో... భద్రత మండలి ఈ తీర్మానాన్ని ఆమోదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 15 సభ్య దేశాలున్న ఈ మండలి సమావేశాలకు భారత్ నెల రోజులుగా అధ్యక్ష వహిస్తూ వచ్చింది. విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా సారథ్యాన జరిగిన చివరి రోజు సమావేశంలో ఈ తీర్మానం ఆమోదం పొందడం విశేషం. ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాలు ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని 13 సభ్య దేశాలు ఆమోదించాయి. ఏ దేశమూ వ్యతిరేకించలేదు. అయితే, తీర్మానం రూపకల్పనలో తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదంటూ రష్యా, చైనాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు.
తీర్మానంలో కీలక అంశాలు...
అఫ్గానిస్థాన్ సార్వభౌమత్వాన్ని, స్వతంత్రతను, ప్రాదేశిక సమగ్రతను, జాతీయ ఐక్యతను భద్రత మండలి గుర్తిస్తోంది. కానీ, ఈనెల 26న కాబుల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల జరిగిన ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడులను తాలిబన్ ఖండించడాన్ని గుర్తిస్తున్నాం.
అఫ్గాన్‌లో ఉగ్రవాద నిర్మూలనకు కృషి జరగాలి. తీర్మానం 1267 (1999)లో పేర్కొన్న లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హక్కానీ నెట్వర్క్, ఐఎస్ఐఎల్ (దాయిష్), అల్-ఖైదా, వాటితో సంబంధమున్న వ్యక్తులు, సంస్థలను నియంత్రించాలి.
కాబుల్ విమానాశ్రయం వద్ద మరిన్ని ఉగ్ర దాడులు జరక్కుండా అంతర్జాతీయ సమాజం గట్టి చర్యలు తీసుకోవాలి.
అఫ్గానిస్థాన్‌లో బాలికలు, మహిళలకు భద్రత కల్పించాలని; మానవ హక్కులను పరిరక్షించాలని శ్రింగ్లా ఆకాంక్షించారు. ‘‘అఫ్గాన్ నుంచి ఇప్పుడు, రేపు, మరెప్పుడైనా ఎవరైనా సురక్షితంగా విదేశాలకు వెళ్లేందుకు తాలిబన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి’’ అని ఐరాసలో అమెరికా రాయబారి లిండా థామస్-గ్రీన్‌ఫీల్డ్ చెప్పారు.
మరో 3 కీలక తీర్మానాలు...
భారత్ సారథ్యంలోని భద్రత మండలి సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజున.. పశ్చిమ ఆసియా శాంతి ప్రక్రియ, పాలస్తీనా అంశంపై చర్చ జరిగింది. మాలిలో ఐరాస భద్రతమండలి ఆంక్షలు; లెబనాన్‌లో శాంతిని నెలకొల్పేందుకు ఐరాస మధ్యంతర బలగాలను కొనసాగించడం, సోమాలియాలో ఐరాస సహాయ కార్యక్రమం కొనసాగింపునకు సంబంధించిన మూడు తీర్మానాలకు కూడా మండలి ఆమోదముద్ర వేసింది.
చరిత్రలోనే అత్యంత దారుణం: ట్రంప్
వాషింగ్టన్: అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణను బైడెన్ ప్రభుత్వం అత్యంత అసమర్థంగా నిర్వహించిందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. చరిత్రలోనే ఇంత దారుణమైన ఉపసంహరణను చూడలేదన్నారు. అఫ్గాన్ గడ్డపై 20ఏళ్ల సుదీర్ఘ యుద్ధానికి సంపూర్ణ ముగింపు పలుకుతూ అమెరికా రక్షణ దళాల చిట్టచివరి విమానం సోమవారం అర్ధరాత్రి కాబుల్ నుంచి బయల్దేరింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ బైడెన్ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్ కోసం అమెరికా ఖర్చు చేసిన 8500 కోట్ల డాలర్లతో పాటు అక్కడ వదిలివచ్చిన ప్రతి వస్తువునూ వెంటనే తిరిగివ్వాలని డిమాండ్ చేయాలన్నారు. ఇవ్వని పక్షంలో భారీ సంఖ్యలో అక్కడకు సైనిక బలగాలను పంపించి వాటిని తీసుకురావాలని లేదా బాంబులు వేసి వాటిని నాశనం చేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీహేలీ కూడా బైడెన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.