Modi: మోదీ పర్యటనలో భద్రతా లోపం.. వెలుగులోకిరైతు నేత వివాదాస్పద వ్యాఖ్యలు

రైతులు రహదారిని దిగ్బంధించడంతో ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనకు అవాంతరం ఏర్పడింది. ఆయన వాహన శ్రేణి 15-20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌పై చిక్కుకుపోవడం తీవ్ర కలకలం సృష్టించింది.

Updated : 06 Jan 2022 16:44 IST

దిల్లీ: రైతులు రహదారిని దిగ్బంధించడంతో ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనకు అవాంతరం ఏర్పడింది. ఆయన వాహన శ్రేణి 15-20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌పై చిక్కుకుపోవడం తీవ్ర కలకలం సృష్టించింది. అయితే మోదీ కాన్వాయ్‌కు అడ్డుపడిన నిరసనకారులకు భారతీయ కిసాన్ యూనియన్ (క్రాంతికారి) సభ్యుడు కృతజ్ఞతలు తెలుపుతున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

ఆ వీడియోలో బీకేయూ క్రాంతికారి నేత నిరసనకారుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘మోదీ ఫిరోజ్‌పూర్‌లో ర్యాలీ నిర్వహించకుండా మీ బలం అడ్డుకుంది. ప్రధాని ప్రచార వేదిక నుంచి కేవలం 10-11 కిలోమీటర్ల దూరంలో రహదారిని నిర్బంధించగలిగాం. ఈ భాజపా మనపై నీటి ఫిరంగులను ప్రయోగించింది. రహదారులపై మేకుల్ని ఉంచింది. ఇప్పుడు మేం అడ్డుకున్నాం’ అని బస్‌ టాప్‌పై నిలబడి వ్యాఖ్యలు చేయడం కనిపిస్తోంది.

పంజాబ్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోదీ బఠిండా విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్‌లో ఫిరోజ్‌పుర్‌లోని హుస్సేనీవాలాకు వెళ్లాల్సి ఉంది. అక్కడ ర్యాలీలోనూ ప్రసంగించాల్సి ఉంది. అయితే ఆయన హెలికాప్టర్‌ ప్రయాణానికి వాతావరణం అవరోధంగా నిలిచింది. 20 నిమిషాలు విమానాశ్రయంలోనే ప్రధాని వేచి చూశారు. వాతావరణం మెరుగుపడకపోవడంతో..రోడ్డు మార్గంలోనే హుస్సేనీవాలాకు వెళ్లాలని భావించారు. ప్రధాని భద్రతాధికారులు ఈ సమాచారాన్ని పంజాబ్‌ పోలీసులకు అందించారు. ఆ రాష్ట్ర డీజీపీ నుంచి రోడ్డు మార్గం భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన అనుమతులు రావడంతో ప్రధాని బయల్దేరారు. గమ్యస్థానం మరో 30 నిమిషాల్లో సమీపిస్తుందనగా.. మోదీ వాహనశ్రేణి ఓ ఫ్లైఓవర్‌కు చేరుకుంది. ఆ సమయంలో అకస్మాత్తుగా 100 మంది రైతులు ఆ మార్గాన్ని దిగ్బంధించారు. ఎంతకీ పరిస్థితి మెరుగుపడక ప్రధాని తిరిగి విమానాశ్రయానికి చేరుకుని దిల్లీకి బయల్దేరి వెళ్లిపోయారు. సంఘటనపై కేంద్ర హోం శాఖ తీవ్రంగా స్పందించింది. అలాగే ఈ వివాదం సుప్రీంకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని