Published : 23 Oct 2021 01:24 IST

China: సెలబ్రిటీలకు చైనా హెచ్చరిక.. వ్యభిచారం కేసులో స్టార్‌ పియానిస్ట్‌ అరెస్టు!

బీజింగ్‌: సామాజిక దిగ్గజ సంస్థలు మొదలు వినోద రంగం వరకూ అన్ని రంగాల్లో ఆంక్షలు విధిస్తున్న చైనా.. సెలబ్రిటీలపైనా కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా వ్యభిచారం ఆరోపణలపై ప్రముఖ అంతర్జాతీయ పియానిస్ట్‌ లీ యండీని అరెస్టు చేసింది. చైనా ప్రభుత్వం అమలుచేసే క్రమశిక్షణ చర్యలను ఎవరైనా సవాలు చేస్తే నిరాశ తప్పదని పరోక్షంగా హెచ్చరించింది. వినోద పరిశ్రమపై అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ కఠినంగా వ్యవహరిస్తున్నారనే విషయం తాజా అరెస్టుతో మరోసారి స్పష్టంగా తెలుస్తోందని అక్కడి అధికారిక మీడియా పేర్కొంది.

వ్యభిచారం ఆరోపణల కేసులో ప్రముఖ అంతర్జాతీయ పియానిస్ట్‌ లీ యండీతో పాటు మరో సెక్స్‌ వర్కర్‌ను అరెస్టు చేసినట్లు చైనా అధికారిక మీడియా పీపుల్స్‌ డైలీ వెల్లడించింది. ఈ సందర్భంగా సామాజిక న్యాయం, నైతికత, చట్టంపై గౌరవం వంటి విషయాల్లో కొందరు సెలబ్రిటీలు తరచుగా ప్రశ్నలు వేస్తున్నారని వ్యాఖ్యానించింది. ఎవరైనా సరే క్రమశిక్షణ, చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందేనన్న చైనా మీడియా.. వాటిని అతిక్రమిస్తే నిరాశ తప్పదని స్పష్టం చేసింది.

గాయకుల అసోసియేషన్‌ నుంచి తొలగింపు

లీ యండీని అరెస్టు చేసినట్లు బీజింగ్‌ పోలీసులు సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేశారు. నలుపు, తెలుపు రంగులే కాకుండా ప్రపంచంలో చాలా రంగులుంటాయి. ప్రతిఒక్కరూ వీటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. ఈ విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ కంగారు పడొద్దని బీజింగ్‌ పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు లీ అరెస్టుపై చైనా గాయకుల సంఘం స్పందించింది. అసాంఘిక చర్యల్లో భాగస్వామ్యమైనట్లు ఆరోపణలు రావడంతో తమ అసోసియేషన్‌ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

వినోద రంగంపై కఠిన వైఖరి..

గతకొంత కాలంగా పలు రంగాలపై షీ జిన్‌పింగ్‌ ప్రభుత్వం ఆంక్షలను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా టెక్‌ కంపెనీలు మొదలు, స్థిరాస్తి రంగంతో పాటు చివరకు విద్యార్థులపైనా నియంత్రణలు అమలుచేస్తోంది. వారంలో కేవలం కొన్ని గంటలు మాత్రమే వీడియో గేమ్‌లు ఆడుకోవాలని ఇదివరకే ఆదేశించింది. ఇక విదేశీ ప్రభావంతో వినోద రంగం కూడా అసభ్యకరంగా మారుతోందని భావిస్తున్న షీ జిన్‌పింగ్‌ ప్రభుత్వం.. ఆ రంగాన్ని గాడిన పెట్టేందుకు చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా వివాదాస్పద కామెంట్లు చేసే సినిమా స్టార్‌లను నిషేధించడం, వారి పారితోషికాల్లో కోతలు, సెలబ్రిటీ కల్చర్‌కు అడ్డుకట్ట వేయడం వంటి చర్యలు చేపడుతోంది.

ఇదిలా ఉంటే, నటీనటులపై విరుచుకుపడటం చైనాకు ఇది కొత్తేమీ కాదు. చైనాలో విక్కీ ఝావోగా పేరుతెచ్చుకున్న ఝావో వీ అనే నటిపై ఇప్పటికే అణచివేత మొదలుపెట్టింది. ఆమెను చైనా సామాజిక మాధ్యమాల నుంచి బహిష్కరించిన చైనా ప్రభుత్వం.. వీబోతో పాటు ఇతర సైట్లలో ఆమె నటించిన చిత్రాలను, వెబ్‌ సిరీస్‌లను తొలిగించింది. ఇక చైనాలో కాలుష్యం, పిల్లల అక్రమ రవాణాపై వరుస కథనాలు రాసిన కారణంగా చైనీస్‌-అమెరికన్‌ బ్లాగర్‌ చార్లెస్‌ షియూను 2013లో అరెస్టు చేసింది. 2018లో అత్యధిక పారితోషికం తీసుకొంటున్న నటి ఫాన్‌ బింగ్‌బింగ్‌ను కూడా అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. ఇలా క్రమశిక్షణారాహిత్యంతో ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడే సెలబ్రిటీలపై చైనా ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతూనే ఉంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని