Vaccination: పేరుకుపోతున్న టీకా నిల్వలు.. రాష్ట్రాల వద్ద 15 కోట్ల డోసులు!

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ కాస్త మందగించినట్లు కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం నవంబర్‌ 5 నాటికి దాదాపు 108కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Published : 05 Nov 2021 23:57 IST

10 కోట్ల మంది రెండో డోసుకు దూరం

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ కాస్త మందగించినట్లు కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం నవంబర్‌ 5 నాటికి దాదాపు 108 కోట్ల డోసులను పంపిణీ చేశారు. మరో 15 కోట్ల 54లక్షల డోసులు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వద్దే ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకు ఇప్పటివరకు మొత్తం 116 కోట్ల డోసులను ఉచితంగా అందజేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన సమయంలో టీకా కొరత ఉన్నట్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన రాష్ట్రాలు.. ప్రస్తుతం పంపిణీలో మాత్రం డీలా పడినట్లు తెలుస్తోంది.

10 కోట్ల మంది రెండో డోసుకు దూరం..

దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలై పది నెలలు కావొస్తున్నా.. ఇప్పటివరకు 32 శాతం మందికి మాత్రమే పూర్తి మోతాదులో వ్యాక్సిన్‌ అందించారు. కనీసం 77 శాతం అర్హులకు ఒక డోసు పంపిణీ చేశారు. వీరిలో దాదాపు 10 కోట్ల మంది రెండో డోసు తీసుకోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ ఈ మధ్యే ఆందోళన వ్యక్తం చేసింది. నిర్లక్ష్యం చేయకుండా రెండో డోసు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా వ్యాక్సిన్‌ మందకొడిగా సాగుతున్న రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్‌ తక్కువగా ఉన్న జిల్లాల్లో ఇంటింటికీ వెళ్లి టీకా అందించాలని సూచించింది.

48 జిల్లాల్లో 50 శాతం కంటే తక్కువే..

వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా తొలి డోసు అందించడంలో రాష్ట్రాలన్నీ ముందంజలో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా పలు జిల్లాలు మాత్రం వెనుకబడిపోయాయి. దేశంలో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అర్హులైన (18 ఏళ్ల వయసు పైబడిన) వారిలో సరాసరి 77 శాతం మంది కనీసం ఒకడోసు అందుకున్నారు. కానీ, దేశవ్యాప్తంగా 48 జిల్లాల్లో మాత్రం కేవలం 50శాతం మంది మాత్రమే ఒకడోసు తీసుకున్నారు. మొత్తంగా 13 రాష్ట్రాల్లో ఈ సమస్య ఉండగా ఈశాన్య రాష్ట్రాలు వ్యాక్సిన్‌ పంపిణీలో మరింత వెనుకబడిపోయాయి. నాగాలాండ్‌లో ఓ జిల్లాలో కేవలం 16 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్‌ అందింది. ఝార్ఖండ్‌లో మొత్తం 24 జిల్లాల్లో 10జిల్లాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. మహారాష్ట్ర, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, మేఘాలయా రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.

దేశవ్యాప్తంగా సెప్టెంబరులో రోజువారీగా 78 లక్షల డోసులను పంపిణీ చేయగా అక్టోబర్‌ నాటికి 56 లక్షలకు తగ్గింది. తొలిడోసు తీసుకున్న తర్వాత రెండో డోసుకు గడువు దాటిపోయినప్పటికీ చాలా మంది ముందుకు రావడం లేదని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. రెండు డోసు విషయంలో ప్రజలు కాస్త ఉదాసీనత వహిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. కొవిడ్‌ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదని.. దీనికితోడు పండగల సీజన్‌ కూడా మరో కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ తక్కువగా ఉన్న జిల్లా అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని