Omicron: ఒమిక్రాన్‌పై మన టీకాలు పనిచేస్తాయా: కేంద్రం ఏం చెప్పిందంటే..!

దేశవ్యాప్తంగా కలవరపెడుతోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు పనిచేయవని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Published : 21 Dec 2021 22:56 IST

రాజ్యసభలో క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: దేశవ్యాప్తంగా కలవరపెడుతోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు పనిచేయవని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తీవ్రవ్యాధి బారిన పడకుండా వ్యాక్సిన్‌లు తప్పకుండా రక్షణ కల్పిస్తాయని స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని తగ్గించేలా వైరస్‌ మార్పులకు గురవుతున్నట్లు వస్తోన్న నివేదికల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఈ క్లారిటీ ఇచ్చింది.

‘ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్‌ల సామర్థ్యం లేదా ప్రభావశీలతపై ఇప్పటివరకు పరిమిత సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. పూర్తిగా సమీక్ష జరిపిన నివేదికల ఆధారాలు కూడా లేవు. అయినప్పటికీ వ్యాక్సిన్‌ల నుంచి వృద్ధిచెందే యాంటీబాడీలతో పాటు కణాల రోగనిరోధకత నుంచీ రక్షణ కలుగుతుంది. ఇవి ఎక్కువ కాలమే రక్షణ కల్పిస్తాయని అంచనా వేస్తున్నాం. తీవ్రవ్యాధి బారినపడకుండా వ్యాక్సిన్‌లు రక్షణ కల్పిస్తాయి. అందుకే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లను తీసుకోవడమే అత్యంత కీలకం’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు. ఇప్పటివరకు పంపిణీ చేస్తోన్న వ్యాక్సిన్‌లు కొత్తవేరియంట్‌ను ఎదుర్కొంటాయా అని రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ విధంగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ముమ్మరంగా కట్టడి చర్యలు..

కొత్త వేరియంట్‌ విజృంభణ నేపథ్యంలో వైరస్‌ కట్టడి చర్యలు ముమ్మరం చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. ఇప్పటికే వేరియంట్‌ ముప్పు అధికంగా ఉన్న దేశాలను ‘ఎట్‌-రిస్క్‌’ జాబితాలో చేర్చామన్న ఆయన.. అక్కడ నుంచి భారత్‌ వచ్చేవారికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు, ఏడు రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి చేశామన్నారు. నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పంపించి ఒమిక్రాన్‌తోపాటు ఇతర వేరియంట్‌లను నిర్ధారించుకుంటున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు భారత్‌లోనూ రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో 200 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి. ఇదే సమయంలో మునుపటి ఇన్‌ఫెక్షన్‌, టీకాల నుంచి పొందిన రక్షణ నుంచి ఒమిక్రాన్‌ తప్పించుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల పనితీరుపై నిపుణులతో కేంద్ర ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని