
WHO: ఒమిక్రాన్.. మహమ్మారి గమనాన్ని మార్చగలదు..!
జెనీవా: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. మహమ్మారి గమనాన్ని మార్చగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అందుకే ప్రపంచ దేశాలన్నీ సాధ్యమైనంత ఎక్కువమందికి టీకాలు అందించాలని, ప్రజలను రక్షించుకునేందుకు కట్టడి చర్యలను పాటించాలని సూచించింది.
‘ఒమిక్రాన్.. అంతర్జాతీయ సంక్షోభంగా మారకుండా మనం నిరోధించగలం. వైరస్ మారుతోంది. కానీ మన సంకల్పం మాత్రం మారకూడదు’ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ వెల్లడించారు. డెల్టా కంటే ఒమిక్రాన్ వల్ల స్వల్ప లక్షణాలే ఉన్నాయని ప్రారంభ నివేదికలను బట్టి తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటికే ఒక అభిప్రాయానికి రావడం తొందరపాటే అవుతుందన్నారు. ‘వేగంగా వ్యాప్తి చెందే లక్షణం, అసాధారణ మ్యుటేషన్లు కలిగిన ఒమిక్రాన్.. మహమ్మారి గమనంపై భారీ ప్రభావాన్ని చూపుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి’ అని అన్నారు. అలాగే ఈ కొత్త వేరియంట్‌పై టీకాల ప్రభావం గురించి మాట్లాడుతూ.. ‘మనం ఇంకా డెల్టా వేరియంట్‌తోనే పోరాడుతున్నాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు వేయడమే అధిక ప్రాధాన్యతగా ఉంది’ అని తెలిపారు. ఫైజర్, బయోన్టెక్ ప్రయోగాల్లో ప్రాథమికంగా వెల్లడైన వివరాలు.. ఒమిక్రాన్ కట్టడికి బూస్టర్ డోసు ఆవశ్యకతను వెల్లడించాయి. ఇంకా కొన్ని పేద దేశాలకు తగిన స్థాయిలో టీకాలు అందలేదనే ఉద్దేశంతో ఆరోగ్య సంస్థ బూస్టర్ డోసుల పంపిణీకి విముఖత చూపుతోంది. కానీ ఒమిక్రాన్ కట్టడికి బూస్టర్లు పనిచేస్తాయనే ఆధారాలు లభిస్తే.. సంపన్న దేశాలన్నీ దానివైపు మొగ్గుచూపుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికాలో మొదట వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కొద్ది రోజుల వ్యవధిలోనే 57 దేశాలకు వ్యాపించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.