
Rakesh Tikait: సాగుచట్టాల రద్దు ఓకే.. ఇక ఇతర సమస్యలపై ఉద్యమిస్తాం!
డిసెంబర్ 4న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్న రైతు సంఘాలు
దిల్లీ: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాదికాలంగా అన్నదాతలు చేస్తోన్న ఆందోళలు ఎట్టకేలకు ఫలించాయి. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభలో నేడు ఆమోదం లభించింది. వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుకు లోక్‌సభ ఆమోదం తెలపడంపై రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయినప్పటికీ రైతులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై దృష్టిపెడతామని పేర్కొన్నాయి. ముఖ్యంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు ఇతర అంశాలపై తమ పోరును కొనసాగిస్తామని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు. సాగు చట్టాల రద్దు నేపథ్యంలో సంబురాలు చేసుకోబోమని.. ఈ ఉద్యమంలో పాల్గొని ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. డిసెంబర్ 4న తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
ఇదిలా ఉంటే, సాగుచట్టాల రద్దుకు సంబంధించిన బిల్లును కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాటిని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తిరస్కరించారు. అనంతరం మూజువాణి ఓటుతో సాగు చట్టాల రద్దుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అయితే, బిల్లుకు ఆమోదం తెలిపిన తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. సాగు చట్టాల రద్దు బిల్లుపై చర్చ జరగకుండా ఆమోదం తెలపడాన్ని తప్పుబడుతున్నాయి. ఈ అంశంలో ప్రతిపక్షాలకు కనీసం ఒక్క ఛాన్సు కూడా ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.