Sameer Wankhede: మంత్రి గారూ.. ఆరోపించడం కాదు, రుజువు చూపించండి..!

డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్ అరెస్టు విషయంలో కీలకంగా వ్యవహరించిన ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తన మతమార్పిడి గురించి వస్తోన్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ చేసిన వ్యాఖ్యలకు సూటిగా బదులిచ్చారు. తన మొదటి వివాహం గురించి మాలిక్‌ ట్విటర్‌లో ఫొటో షేర్ చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. 

Published : 27 Oct 2021 20:42 IST

మాలిక్ చేసిన ట్వీట్‌కు బదులిచ్చిన వాంఖడే

ముంబయి: డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్ (Aryan Khan) అరెస్టు విషయంలో కీలకంగా వ్యవహరించిన NCB జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే (Sameer Wankhede) తన మతమార్పిడి గురించి వస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ (Nawab Malik) చేసిన వ్యాఖ్యలకు సూటిగా బదులిచ్చారు. తన మొదటి వివాహం గురించి మాలిక్‌ ట్విటర్‌లో ఫొటో షేర్ చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. 

‘నా తండ్రి హిందువు. నా తల్లి ముస్లిం. వారిద్దరంటే నాకెంతో ప్రేమ. నేను ఇస్లాం సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకోవాలని మా అమ్మ కోరింది. అదే నెల నేను స్పెషల్ మ్యారేజెస్‌ యాక్ట్‌ కింద నా వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నాను. వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకుంటే.. ఈ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత చట్టబద్ధంగా మేం విడిపోయాం. నేను పుట్టుకతోనే హిందువును. ఇప్పటికీ హిందువునే. ఎలాంటి మతమార్పిడి జరగలేదు. అదే జరిగుంటే.. నవాబ్ మాలిక్ ఆ ధ్రువపత్రం చూపించాలి. నా మొదటి వివాహానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని నా తండ్రి చూపిస్తారు’ అని వాంఖడే స్పష్టం చేశారు.  

నిఖానామా జరిగింది: సమీర్ భార్య

మాలిక్ షేర్ చేసిన చిత్రంపై సమీర్ వాంఖడే రెండో భార్య క్రాంతి రేడ్కర్ మీడియాతో మాట్లాడారు. ‘నిఖానామా నిజమే. ఆ వివాహం జరిగింది. కానీ, సమీర్ తన కులం, మతం మార్చుకోలేదు. మా అత్తయ్య ముస్లిం కావడంతో ఆమె సంతోషం కోసం ఈ పద్ధతిలో వేడుక జరిగింది. అలాగే నవాబ్‌ మాలిక్ షేర్ చేసిన జన్మ ధ్రువపత్రం నిజమైంది కాదు’ అని వెల్లడించారు. సమీర్ వాంఖడేకు ముస్లిం పద్ధతిలో జరిగిన వివాహానికి సంబంధించిన ఫొటోను ఈ రోజు మాలిక్ ట్విటర్ షేర్ చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు మూడు వారాల క్రితం ముంబయిలోని క్రూజ్ నౌక డ్రగ్స్‌ కేసు (Cruise Ship Party)లో ఆర్యన్ ఖాన్ అరెస్టయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సమీర్ వాంఖడేపై మాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకోవైపు ఆర్యన్‌ ఖాన్‌ విడుదలకు అతడి తండ్రి షారుఖ్ (Sharukh Khan) నుంచి రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఈ కేసులో సాక్షి ఆరోపించాడు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ఎన్‌సీబీ (NCB) వాంఖడేపై విచారణ జరుపుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు