
UK: మా సమస్య కొవిషీల్డ్‌తో కాదు.. టీకా ధ్రువపత్రంతో
క్వారంటైన్ నిబంధనల విషయంలో యూకే తిరకాసు
దిల్లీ: కొవిషీల్డ్ టీకా రెండు డోసులు తీసుకున్న భారత ప్రయాణికుల క్వారంటైన్ నిబంధనల విషయంలో బ్రిటన్ వెనక్కి తగ్గినట్లే తగ్గి.. తిరకాసు పెట్టింది. కొవిషీల్డ్‌ను ఆమోదించిన టీకాల జాబితాలో చేర్చుతూ తన ప్రయాణ నిబంధనలను సవరించింది. అయితే తమ సమస్య టీకాతో కాదని, టీకా ధ్రువపత్రంతో అంటూ చెప్పుకొచ్చింది. అందుకే కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న ప్రయాణికులు క్వారంటైన్లో ఉండాల్సి ఉందని తాజాగా వెల్లడించింది. తమకు కొవిన్ ధ్రువపత్రం జారీ ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయని.. దీనిపై భారత ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపింది.
అక్టోబరు 4వ తేదీ నుంచి విదేశీ ప్రయాణికులకు అమలు చేసే కొవిడ్ నిబంధలను బ్రిటన్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. దాని ప్రకారం భారత్, మరికొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కొవిషీల్డ్ రెండు డోసుల టీకా తీసుకున్నప్పటికీ వారిని టీకా తీసుకోనివారిగానే పరిగణిస్తామని పేర్కొంది. ఆ దేశాల నుంచి వచ్చే వారు.. తమ ప్రయాణానికి ముందుగా, యూకేకు చేరుకున్న తర్వాత పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి. పది రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధనల పట్ల భారత్‌లో నిరసన వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలో ఈ నిబంధనలు వివక్షా పూరితంగా ఉన్నాయంటూ మంగళవారం కేంద్రం తీవ్రంగా స్పందించింది. భారత్‌లో తయారైన టీకాలను వినియోగించుకున్న బ్రిటన్.. ఇలాంటి నిబంధనలు విధించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, లేదంటే ప్రతిచర్య తప్పదని హెచ్చరించింది. ఈ క్రమంలోనే బ్రిటన్ స్పందించింది.
టీకా ధ్రువపత్రంతో సమస్యేం లేదు: భారత్
తమ అభ్యంతరం కొవిషీల్డ్ గురించి కాదని, టీకా ధ్రువపత్రంతోనే అని బ్రిటన్ అనుమానం వ్యక్తం చేయగా.. టీకా ధ్రువపత్రంతో ఎలాంటి సమస్య లేదని భారత ఉన్నతాధికారి స్పష్టం చేశారు. కొవిన్ యాప్, టీకా ధ్రువపత్రం జారీ చేసే ప్రక్రియలో ఎలాంటి సమస్య లేదని జాతీయ హెల్త్ అథారిటీ చీఫ్ ఆర్ఎస్ శర్మ వెల్లడించారు. ‘కొవిన్, టీకా ధ్రువపత్రం విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాలకు అనుగుణంగా ఈ వ్యవస్థ ఉంది. అలాగే మేం అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థలతో కూడా చర్చలు కొనసాగిస్తున్నాం. ఇటీవల యూకే రాయబారి నన్ను కలిశారు. వారు ఈ ప్రక్రియ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు’ అంటూ శర్మ మీడియాకు వెల్లడించారు.