Kargil Vijay Diwas: రాష్ట్రపతి కార్గిల్‌ పర్యటన రద్దు

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కార్గిల్‌ పర్యటన చివరి నిమిషంలో రద్దయ్యింది. సోమవారం కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని ద్రాస్‌లోని కార్గిల్‌ యుద్ధ స్మారకం వద్ద ప్రథమ పౌరుడు

Published : 26 Jul 2021 10:40 IST

దిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కార్గిల్‌ పర్యటన చివరి నిమిషంలో రద్దయ్యింది. సోమవారం కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని ద్రాస్‌లోని కార్గిల్‌ యుద్ధ స్మారకం వద్ద ప్రథమ పౌరుడు నివాళులర్పించనున్నట్లు అధికారులు తొలుత చెప్పారు. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రాష్ట్రపతి అక్కడికి రావడం లేదని ఆర్మీ అధికారులు తాజాగా వెల్లడించారు. బారాముల్లాలోని యుద్ధ స్మారకం వద్ద కోవింద్‌ అమరవీరులకు నివాళులర్పించనున్నట్లు తెలిపారు.

ఇక కార్గిల్‌ యుద్ధ స్మారకం వద్ద చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆర్‌కే మాథుర్‌, ఎంపీ జమ్‌యాంగ్ సెరింగ్ యుద్ధ వీరులకు నివాళులర్పించారు. రావత్‌ విజయ జ్యోతిని వెలిగించారు. అటు దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ బదౌరియా, నేవీ వైస్‌ చీఫ్‌ అడ్మిరల్‌ జి. అశోక్‌ కుమార్‌.. అమరవీరులకు అంజలి ఘటించారు.

వారి త్యాగం చిరస్మరణీయం..

కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్‌ వేదికగా అమరువీరులకు నివాళులర్పించారు. జవాన్ల పరాక్రమాలను గుర్తుచేసుకున్నారు. ‘‘వారి త్యాగం, శౌర్యం చిరస్మరణీయం. ఈ కార్గిల్‌ విజయ్‌ దివస్‌ నాడు దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులర్పిస్తున్నా. వారి ధైర్యం ప్రతి రోజు మనలో స్ఫూర్తి నింపుతూనే ఉంది’’ అని మోదీ ట్వీట్ చేశారు.

1999 జులై 26న కార్గిల్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య యుద్ధం జరిగింది.  ‘ఆపరేషన్‌ విజయ్‌’ పేరుతో చేపట్టిన ఆ యుద్ధంలో భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో అప్పటి నుంచి ఏటా ఈ రోజును కార్గిల్‌ విజయ్‌ దివస్‌గా జరుపుకొంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని