Farm Laws: సాగు చట్టాలు రద్దయ్యాయి.. మరి రైతులపై ఉన్న కేసుల సంగతేంటి..?

సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి శుక్రవారం ప్రధాని మోదీ దేశ ప్రజలను ఆశ్చర్యపర్చారు. అయితే ఈ చట్టాలపై దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా పంజాబ్, హరియాణా, యూపీలోని కొన్ని ప్రాంతాల్లో నిరసన వ్యక్తమైన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా జరిగిన ఘటనల్లో పోలీసులు పలువురు నిరసనకారులపై కేసులు నమోదుచేశారు.

Published : 19 Nov 2021 18:43 IST

దిల్లీ: సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి శుక్రవారం ప్రధాని మోదీ దేశ ప్రజలను ఆశ్చర్యపర్చారు. అయితే ఈ చట్టాలపై దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా పంజాబ్, హరియాణా, యూపీలోని కొన్ని ప్రాంతాల్లో నిరసన వ్యక్తమైన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా జరిగిన ఘటనల్లో పోలీసులు పలువురు నిరసనకారులపై కేసులు నమోదుచేశారు. ఇప్పుడు చట్టాల రద్దుతో ఆ కేసులు సంగతేంటనే ప్రశ్న అందరిలో మొదలైంది. అయితే దిల్లీ పోలీసు విభాగానికి చెందిన ఓ అధికారి మాత్రం ఈ కేసుల్లో దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు. 

‘నిరసనకారులపై ఆస్తుల ధ్వంసం, ఆదేశాల ఉల్లంఘనతో సహా కొన్ని క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే ఉపా(అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) కింద కేసులు నమోదయ్యాయి. వాటిపై దర్యాప్తు కొనసాగుతుంది’ అని వెల్లడించారు. ప్రభుత్వం తలుచుకుంటే ఆ కేసుల విషయంలో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి వెనక్కి తీసుకునే వీలుందన్నారు. 

సాగు చట్టాలపై నిరసన వ్యక్తం చేసిన క్రమంలో దిల్లీలో రైతులపై 39 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఫిబ్రవరిలో కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది.  136 కేసులు నమోదైనట్లు హరియాణా ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించింది. ఆ రాష్ట్రంలోని కొన్ని పోలీసు స్టేషన్లలో సుమారు 10వేల మంది అజ్ఞాత రైతులపై కేసులు పెట్టినట్లు నివేదికలను బట్టి తెలుస్తోంది. సోనేపత్‌లో 26 ఎఫ్ఐఆర్‌లు, అంబాలాలో 15, కురుక్షేత్రలో 14 రిజిస్టర్ అయ్యాయి. ఓ రైతు సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం హరియాణాలో దాదాపు 2,500 మందిపై కేసులు నమోదయ్యాయి. సాగు చట్టాలను వ్యతిరేకించిన నిరసనకారులపై ఇన్ని కేసులున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..! 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని