Published : 13 Nov 2021 01:11 IST

Afghanistan: మృత్యువు అంచుల్లో.. 10లక్షల మంది చిన్నారులు!

ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా: తాలిబన్ల ఆక్రమణ తర్వాత అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయి. అక్కడి ప్రజలకు కనీసం రెండు పూటలా తిండి దొరికే పరిస్థితులు కనిపించడం లేదు. ఇవి ముఖ్యంగా చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే డిసెంబర్‌ చివరినాటికి అఫ్గాన్‌లో 32లక్షల మంది చిన్నారులు తీవ్ర పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఇదే సమయంలో ఉష్ణోగ్రతలు కూడా క్షీణించడం వల్ల దాదాపు 10లక్షల మంది చిన్నారులు మరణ ముప్పును ఎదుర్కోనున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది.

మొండిచేయి చూపొద్దు..

తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అఫ్గాన్‌కు విదేశీ సంస్థల నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి. దీనికి తోడు వర్షాభావంతో అక్కడ కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు జీతాలు చెల్లించకపోవడంతో ఆరోగ్య సిబ్బంది కూడా విధులకు దూరంగా ఉంటున్నారు. అక్కడి జనాభాలో మూడోవంతు మందికి రెండు పూటలా ఆహారం దొరికే పరిస్థితులు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో యావత్‌ ప్రపంచం అఫ్గానిస్థాన్‌కు మొండిచేయి చూపకూడదని కాబుల్‌లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార ప్రతినిధి మార్గరెట్‌ హారిస్‌ కోరారు.

చిన్నారులకు మరణశాసనమే..

‘రాత్రివేళ ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీ సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఇవి వృద్ధులు, యువకుల్లో ఇతర వ్యాధులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులకు ఇవి మరింత ప్రమాదకంగా మారుతున్నాయి. సాధారణ బరువు కంటే అతితక్కువ బరువుతో పుట్టిన పిల్లలతో ఇక్కడి ఆస్ప్రతులు నిండిపోతున్నాయి. దేశంలో మీజిల్స్ వ్యాధి (Measles) కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 24వేల కేసులు నమోదయ్యాయి. పోషకాహారలోపం తీవ్రతరమైన చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. పోషకాహారలోపం తీవ్రమైన వారికి మీజిల్స్ ఒక మరణశిక్ష వంటిదే. ఇలాంటి సమయంలో తక్షణమే స్పందించకుంటే ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది’ అని డబ్ల్యూహెచ్‌ఓ అధికార ప్రతినిధి మార్గరెట్‌ హారిస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇప్పటివరకు ఎంతమంది చిన్నారులు చనిపోయారనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే, అఫ్గాన్‌లో చోటుచేసుకుంటున్న ఇలాంటి దారుణ పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని తాలిబన్‌ ప్రభుత్వం బయట ప్రపంచానికి వెల్లడించడం లేదు. కేవలం అంతర్జాతీయ, స్వచ్ఛంద సంస్థలు మాత్రమే అక్కడి పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అక్కడ ఆహార నిల్వలు నిండుకుంటున్నాయని.. అఫ్గాన్‌లో ప్రతి ఇద్దరి వ్యక్తుల్లో ఒకరు తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నట్లు ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP), ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) హెచ్చరించాయి. ఈ శీతాకాలంలో ఈ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని ఇదివరకే ఆందోళన వ్యక్తం చేశాయి.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని