Labor shortage: ఇంకా రెజ్యూమ్‌ల గురించి ఆలోచిస్తారేంటి..?

కరోనా మహమ్మారి తర్వాత అగ్రదేశం అమెరికాలో ఉద్యోగుల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. కొత్త అవకాశాలు, అధిక జీతం లభించే మార్గాలవైపు దృష్టిసారిస్తుండంలో అక్కడి కంపెనీలను ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కొత్తవారిని నియమించుకోవడంలో తంటాలు పడుతున్నాయి.

Published : 18 Nov 2021 12:51 IST

వాషింగ్టన్: కరోనా మహమ్మారి తర్వాత అగ్రదేశం అమెరికాలో ఉద్యోగుల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. కొత్త అవకాశాలు, అధిక జీతం లభించే మార్గాలవైపు దృష్టిసారిస్తుండటంతో అక్కడి కంపెనీలను ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కొత్తవారిని నియమించుకోవడంలో తంటాలు పడుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన అతిపెద్ద ఉపాధి పోర్టల్ కార్మికుల కొరతకు కొత్త పరిష్కారం చెప్పింది. సంప్రదాయ రెజ్యూమ్‌ పద్ధతిని పక్కనపెట్టాలని జపాన్‌కు చెందిన రిక్రూట్ కంపెనీ సీఈఓ హిసయుకి ఇడెకోబా సూచించారు.

ప్రస్తుత పరిస్థితిపై రిక్రూట్ సీఈఓ మాట్లాడుతూ.. ‘ఒకవైపు కార్మికుల కొరత వేధిస్తుంటే నియామక పక్రియ ఇంకా కొనసాగుతోంది. రెజ్యూమ్‌లను పంపడం, వాటిని తనిఖీ చేయడం వంటివి చేస్తున్నారు. అయితే ఈ సంస్కృతి నుంచి ముందుకు సాగడానికి ప్రస్తుత పరిస్థితి మంచి అవకాశం’ అని అభిప్రాయపడ్డారు. కాలానికి అనుగుణంగా నియామక ప్రక్రియ మారాలన్నారు. చిన్న, మధ్యతరహా సంస్థలు ఉద్యోగాల భర్తీలో దశాబ్ద కాలంనాటి విధానాలనే వాడుతున్నాయని తెలిపారు. ఒక రెస్టారెంట్‌ను ఉదాహరణ చూపుతూ..  కళాశాల డిగ్రీతో సంబంధంలో లేకుండా, యాజమాన్యాలు అప్పజెప్పిన పనిని పూర్తి చేయగలరో లేదో పరిశీలిస్తే చాలన్నారు. సిబ్బంది కొరత కారణంగా తాను ఇటీవల ఒక రెస్టారెంట్‌లో 40 నిమిషాలు పాటు వేచి చూడాల్సి వచ్చిందని ఈ సందర్భంగా వెల్లడించారు. ట్రక్‌ డ్రైవర్ల ఎంపికకు కూడా సులభమైన పద్ధతిని సూచించారు. ట్రక్ డ్రైవర్ల కొరత అమెరికాను తీవ్రంగా వేధిస్తోన్న సంగతి తెలిసిందే.  

కరోనా తర్వాత ఉద్యోగులు తమ ప్రాధాన్యాలపై దృష్టి సారించడంతో అమెరికా జాబ్ మార్కెట్ పరంగా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. వైట్ కాలర్, బ్లూ కాలర్ ఉద్యోగాలను పూరించడానికి యాజమాన్యాలు శ్రమకోరుస్తున్నాయి. నియామకాల డిమాండ్ పెరగడంతో సెప్టెంబర్‌లో ముగిసిన త్రైమాసికంలో రిక్రూట్ రెట్టింపు ఆదాయాన్ని ఆర్జించింది. 2021లో కంపెనీ షేర్లు 80 శాతానికి పైగా పెరిగాయి. దాంతో మార్కెట్ విలువ ఆధారంగా జపాన్‌లో నాలుగో అతిపెద్ద సంస్థగా నిలిచింది. రిక్రూట్ ఆధ్వర్యంలో ఇండీడ్. కామ్, గ్లాస్‌డోర్ కంపెనీలు నడుస్తున్నాయి. ఇండీడ్ అమెరికాకు చెందిన ఎంప్లాయ్‌మెంట్ వెబ్‌సైట్‌. ఇది ప్రస్తుతం కరోనా ముందునాటిస్థాయిలో సేవలు అందిస్తున్నప్పటికీ.. కార్మికుల కొరతను పరిష్కరించలేకపోయిందని ఇడెకోబా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని