Covid vaccination: మువ్వన్నెల వెలుగులతో 100 కోట్ల పండగ.. ఎక్కడంటే?

100 కోట్ల కరోనా డోసుల రికార్డును భారత్ ఘనంగా జరుపుకుంటోంది. పెద్ద ఎత్తున్న ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Updated : 21 Oct 2021 15:25 IST

దిల్లీ: 100 కోట్ల కరోనా డోసుల రికార్డును భారత్ ఘనంగా జరుపుకుంటోంది. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, భాజపా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో పురావస్తుశాఖ కూడా ఈ ఆనందంలో పాలు పంచుకుంది. 100 కోట్ల డోసులకు సూచనగా 100 వారసత్వ కట్టడాలను జాతీయ పతాక వర్ణాల వెలుగులో నింపేయాలని నిర్ణయించింది. గురువారం పురవాస్తు శాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆరోగ్య నిపుణులు, వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌, శాస్త్రవేత్తలు, టీకా తయారీ దారులు, దేశ పౌరుల కృషికి ఈ విధంగా అభినందనలు తెలియజేయనుంది.

జాతీయ జెండా రంగులు విరజిమ్మే కట్టడాల జాబితాలో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన 17 కట్టడాలున్నాయి. వాటిలో కొన్ని.. ఎర్రకోట, కుతుబ్ మినార్, హుమాయున్ టాంబ్‌, తుగ్లకాబాద్‌ ఫోర్ట్‌, పురానా ఖిలా, ఫతేపూర్ సిఖ్రీ, రామప్ప ఆలయం, హంపి, ధోలవీర, పురాతన లేహ్‌ ప్యాలస్. మనదగ్గర హైదరాబాద్‌లోని గోల్కొండ కోటపై కూడా ఈ రంగులు ప్రదర్శించనున్నారు. 100 కోట్ల డోసుల పంపిణీని పురస్కరించుకొని నిర్వహిస్తోన్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగానే దీన్ని చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మనదేశంలో జనవరి 16న కరోనా టీకా కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. నేటికి 100 కోట్ల డోసులు పంపిణీ పూర్తయింది. తొమ్మిది నెలల వ్యవధిలో భారత్‌ ఈ ఫీట్ సాధించింది.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని