
Omicron Fear: ఆఫ్రికా నుంచి ముంబయికి 1000మంది.. ఆచూకీ మాత్రం 466మందిదే!
వంద మంది నమూనాలు మాత్రమే సేకరించామన్న బీఎంసీ
ముంబయి: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. విస్తృత వేగంతో వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన నేపథ్యంలో ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఇప్పటికే కొన్ని దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో గడిచిన 15 రోజుల్లో ఆఫ్రికా దేశాల నుంచి ముంబయికి దాదాపు వెయ్యి మంది ప్రయాణికులు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించాయి. అయితే, వారిలో ఇప్పటివరకు సగం మందిని మాత్రమే కనిపెట్టామని వెల్లడించారు. వీరిలో కేవలం 100 మంది నుంచి మాత్రమే ఇప్పటివరకు కొవిడ్ నిర్ధారణ కోసం శాంపిళ్లను అధికారులు సేకరించడం ఆందోళన కలిగిస్తోంది.
ఆఫ్రికా దేశాల నుంచి గడిచిన 15 రోజుల్లోనే దాదాపు వెయ్యి మంది ముంబయికి వచ్చినట్లు విమానాశ్రయశాఖ అధికారులు బృహన్ ముంబయి మునిసిపల్ అధికారులకు తెలియజేశారు. అనంతరం అందులో కేవలం 466 ప్రయాణికుల సమాచారాన్ని మాత్రమే బీఎంసీ అధికారులకు అందించారు. విమానాశ్రయ అధికారులు ఇచ్చిన ప్రయాణికుల వివరాల్లో ఇప్పటివరకు 100 మంది నుంచి కొవిడ్ నిర్ధారణ కోసం నమూనాలు సేకరించినట్లు బీఎంసీ అధికారి సురేష్ కాకాని వెల్లడించారు. వీటి ఫలితాలు మరికొన్ని గంటల్లోనే వస్తాయని.. ఒకవేళ పాజిటివ్ వస్తే మాత్రం ఆ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తామని తెలిపారు. అయితే, వెయ్యి మంది ప్రయాణికుల్లో కేవలం 466 మంది సమాచారం మాత్రమే లభ్యం కావడం.. మిగతా ప్రయాణికులు వివరాలు తెలియకపోవడంపై అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇదిలాఉంటే, ప్రమాదకరంగా భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు పొంచి వున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దేశాలను ‘రిస్క్’ జాబితాలో చేర్చింది. ఆయా దేశాల నుంచి వచ్చే వారిని తప్పనిసరిగా పరీక్షించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రిస్క్ జాబితాలోని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నాయి. పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించడంతోపాటు వారిని ఐసోలేషన్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.