Delhi: దిల్లీకి ఇది ఐదో వేవ్‌.. ఈ రోజు 10 వేల కేసులు రావొచ్చు..!

దేశ రాజధానిలో ఈ రోజు దాదాపు 10 వేల కరోనా కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్ వెల్లడించారు.

Updated : 05 Jan 2022 16:05 IST

అంచనా వేసిన ఆరోగ్య మంత్రి

దిల్లీ: దేశ రాజధానిలో ఈ రోజు దాదాపు 10 వేల కరోనా కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్ వెల్లడించారు. పాజిటివిటీ రేటు 10 శాతానికి చేరనుందని అంచనా వేశారు. నిన్న అది 8.3 శాతంగా ఉంది. అలాగే భారత్‌ మూడో వేవ్‌లోకి ప్రవేశించిందన్నారు. దిల్లీకి మాత్రం అది ఐదో వేవ్‌ అని వెల్లడించారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పటికీ.. ప్రజలంతా కొవిడ్ నియమాలు తప్పకుండా పాటించాలని సూచించారు. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో 40 శాతం పడకలు కొవిడ్ బాధితుల కోసం రిజర్వ్‌ చేసినట్లు చెప్పారు. అలాగే అన్ని కొవిడ్ పాజిటివ్‌ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపడం సాధ్యం కాదని తెలిపారు. దిల్లీ నుంచి 300-400 నమూనాలు పంపుతున్నామన్నారు.

నిన్న దిల్లీలో 5,481 కరోనా కేసులొచ్చాయి. ముగ్గురు మరణించారు. ఇప్పటివరకూ దిల్లీలో 14,63,701 మందికి వైరస్ సోకింది. 464 మంది ఒమిక్రాన్ బారినపడ్డారు. దిల్లీలో వచ్చే వారం నాటికి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 15 నాటికి రోజువారీ కేసులు 20వేల నుంచి 25వేలకు పెరిగే అవకాశముందని, ఆసుపత్రుల్లో చేరికలు కూడా పెరుగుతాయని ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. కేసుల పెరుగుదలకు డెల్టా, ఒమిక్రాన్‌.. రెండు వేరియంట్లు కారణమని తెలిపాయి. గత రెండు రోజులుగా ఆసుపత్రుల్లో చేరికలు కూడా పెరగడం ఆందోళనలకు గురిచేస్తోంది.

దేశంలో 58 వేల కొత్త కేసులు..

ఇక దేశంలో కరోనావైరస్ మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. శరవేగంగా విస్తరిస్తూ.. తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రెండు రోజులుగా 30వేలకు పైగా నమోదయిన కొత్త కేసులు.. నేడు ఒక్కసారిగా 58 వేలకు చేరాయి. ముందురోజు కంటే 55 శాతం అధికంగా నమోదయ్యాయి. వేగంగా ప్రబలే లక్షణమున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ తాజా వ్యాప్తికి దోహదం చేస్తోంది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ కేసులు రెండు వేల మార్కు దాటేశాయి. భారత్‌లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, వచ్చే రెండు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ఒమిక్రాన్‌ సాధారణ జలుబు లాంటి వ్యాధి కాదు. ఆరోగ్య వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రభావం చూపించొచ్చు. కేసులు అకస్మాత్తుగా, భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. పరీక్షలు చేయడం, రోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం’’ అని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని