Corona: దిల్లీలో కొవిడ్‌ విజృంభణ.. 94% పెరిగిన కేసులు

దేశ రాజధాని దిల్లీలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. నిన్నటితో పోలిస్తే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దిల్లీలో 10,665 మందికి పాజిటివ్‌గా తేలింది......

Published : 05 Jan 2022 21:46 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. నిన్నటితో పోలిస్తే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దిల్లీలో 10,665 మందికి పాజిటివ్‌గా తేలింది. మంగళవారం 5481 కేసులు నమోదవగా.. నేడు కేసుల సంఖ్య 94శాతం పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. దాదాపు 8 నెలల (మే 12) తర్వాత ఇవే అత్యధిక కేసులు కావడం గమనార్హం. ‘ఈ రోజు దాదాపు 10వేల కరోనా కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉంది’ నని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఉదయమే వెల్లడించగా.. అది నిజమైంది. మరణాల సంఖ్య కూడా పెరిగింది. 24 గంటల వ్యవధిలో 8 మంది మృతిచెందారు. పాజిటివిటీ రేటు అమాంతం 11.88కు చేరుకుంది.

సత్యేంద్ర జైన్‌ ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌ మూడో వేవ్‌లోకి ప్రవేశించిందన్నారు. దిల్లీకి మాత్రం అది ఐదో వేవ్‌ అని వెల్లడించారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పటికీ.. ప్రజలంతా కొవిడ్ నియమాలు తప్పకుండా పాటించాలని సూచించారు. ప్రస్తుతం దిల్లీలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో 40 శాతం పడకలు కొవిడ్ బాధితుల కోసం రిజర్వ్‌ చేసినట్లు చెప్పారు. అలాగే అన్ని కొవిడ్ పాజిటివ్‌ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపడం సాధ్యం కాదని తెలిపారు. దిల్లీ నుంచి 300-400 నమూనాలు పంపుతున్నామన్నారు.

దిల్లీలో వచ్చేవారం నాటికి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. జనవరి 15 నాటికి రోజువారీ కేసులు 20వేల నుంచి 25వేలకు పెరిగే అవకాశముందని, ఆసుపత్రుల్లో చేరికలు కూడా పెరుగుతాయని ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. కేసుల పెరుగుదలకు డెల్టా, ఒమిక్రాన్‌.. రెండు వేరియంట్లు కారణమని తెలిపాయి. గత మూడు రోజులుగా ఆసుపత్రుల్లో చేరికలు కూడా పెరగడం ఆందోళనలకు గురిచేస్తోంది.

ముంబయిలో 15,166 కేసులు

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోనూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో  15,166 కేసులు బయటపడ్డాయి. ముగ్గురు మృతిచెందారు. నిన్నటితో పోలిస్తే కేసులు 39శాతం పెరిగిపోయాయి. మంగళవారం 10,860 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. ముంబయిలో ప్రస్తుతం 61వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ నెల 6 నుంచి 13వ తేదీలోపు నగరంలో భారీ స్థాయిలో కేసులు వెలుగుచూస్తాయని వైద్యనిపుణులు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని