Supreme Court: 53 ఏళ్ల కేసు అపీలుకొచ్చింది

మారుమూల గ్రామాల్లోని వారికి న్యాయస్థానాల సమాచారం సకాలంలో చేరకపోతే జరిగే అనర్థాలు

Published : 22 Jul 2021 11:56 IST

 ఆ మాట వినకుండానే 108 ఏళ్ల వృద్ధుని కన్నుమూత

భూమి తాకట్టు వ్యవహారం 

దిల్లీ: మారుమూల గ్రామాల్లోని వారికి న్యాయస్థానాల సమాచారం సకాలంలో చేరకపోతే జరిగే అనర్థాలు ఏమిటో చెప్పడానికి ఉదాహరణగా నిలిచే సంఘటన ఇది. అర్ధ శతాబ్దంగా నలుగుతున్న కేసును సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిందన్న విషయం తెలియకుండానే శతాధిక వృద్ధుడొకరు కన్నుమూయడం వ్యవస్థలోని లోపాలకు అద్దంపడుతుంది. మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లాకు చెందిన సోపన్‌ నర్సింగ గైక్వాడ్‌ (108 ఏళ్లు).. 53 ఏళ్ల క్రితం 1968లో ఓ వ్యక్తి నుంచి భూమి కొనుగోలు చేసి రిజిస్టర్‌ చేసుకున్నాడు. అయితే ఆ భూమిని సదరు యజమాని బ్యాంకుకు తనఖా పెట్టి రుణం తీసుకున్న విషయం ఆ సమయంలో ఆయనకు తెలియదు. పాత యజమాని రుణం చెల్లించకపోవడంతో ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామంటూ బ్యాంకు గైక్వాడ్‌కు నోటీసు పంపించింది. దాంతో ఆయన స్థానిక కోర్టును ఆశ్రయించారు. తాను చట్టబద్ధంగా భూమిని కొనుగోలు చేసినట్టు తెలిపారు. పాత యజమాని నుంచి రుణాన్ని తిరిగి వసూలు చేయాలంటే దీనిని కాకుండా ఆయనకు ఉన్న ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఇందుకు అనుకూలంగా 1982 సెప్టెంబరు 10న కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే దీన్ని సవాలు చేస్తూ పాత యజమాని పైకోర్టులో అపీలు చేశారు. దాంతో కోర్టు తీర్పును నిలిపివేస్తూ 1987లో ఉత్తర్వు వచ్చింది. దీనిపై గైక్వాడ్‌ 1988లో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ 27 ఏళ్ల పాటు పెండింగ్‌లో ఉన్న అనంతరం 2015లో కేసును కొట్టివేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. న్యాయవాదులు విచారణకు రాకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అయితే ఈ విషయం ఆయనకు తెలియదు.

ఆలస్యంగా తెలుసుకున్న ఆయన మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. జాప్యాన్ని క్షమించి కేసును పరిశీలించాలని కోరగా దీన్ని తిరస్కరిస్తున్నట్టు 2019 ఫిబ్రవరి 13న ఉత్తర్వులు ఇచ్చింది. చివరకు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లగా, కేసును విచారణకు స్వీకరిస్తున్నట్టు ఈ నెల 12న జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ హృషీకేశ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ‘‘కేసు పూర్వపరాలను హైకోర్టు పరిశీలించలేదు. కేవలం న్యాయవాదులు రాలేదన్న కారణంతోనే కొట్టివేసింది. మారుమూల గ్రామంలో ఉన్న ఆయన సమాచారం న్యాయవాదులకు తెలియకపోయి ఉండవచ్చు. అందువల్లే సకాలంలో సమాచారం చేరకపోయి ఉండవచ్చు. దీనిని పరిశీలిస్తాం’’ అని ధర్మాసనం పేర్కొంది. అయితే అందుకు కొద్ది రోజుల ముందే పండుముదసలి అయిన గైక్వాడ్‌ కన్నుమూశారు. ఆ విషయం కూడా ఆయన న్యాయవాదికి వెంటనే కాకుండా, బాగా ఆలస్యంగా తెలిసింది. ఆయన వారసులు ఈ కేసులో కక్షిదారులుగా ఉంటారని న్యాయవాది విరాజ్‌ కదమ్‌ తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని