Supreme court: అభియోగాలు లేకుండా 11 ఏళ్లు జైలులోనా?

‘‘శిక్షయినా వేయండి..లేదంటే విడిచిపెట్టేయండి. అంతేకానీ కనీసం అభియోగాలు నమోదు చేయకుండా 11 ఏళ్ల పాటు జైలులో ఉంచుతారా?’’

Updated : 31 Aug 2021 07:58 IST

సుప్రీంకోర్టు ప్రశ్న

దిల్లీ: ‘‘శిక్షయినా వేయండి..లేదంటే విడిచిపెట్టేయండి. అంతేకానీ కనీసం అభియోగాలు నమోదు చేయకుండా 11 ఏళ్ల పాటు జైలులో ఉంచుతారా?’’ అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సత్వర విచారణ నిందితుల హక్కు అని స్పష్టం చేసింది. ఇలా ఎందుకు జరిగిందో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ ట్రయల్‌ కోర్టు జడ్జికి నోటీసు పంపించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం ఇటీవల పై నిర్ణయం తీసుకొంది. 1993లో జరిగిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలులో పేలుడుకు సంబంధించి హమీర్‌ ఉల్‌ ఉద్దీన్‌పై కేసు నమోదైంది. ఇది రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌లో ఉన్న ప్రత్యేక టాడా కోర్టు పరిశీలనకు వచ్చింది. 2010 నుంచి నిందితుడు కస్టడీలోనే ఉన్నా సంబంధిత కోర్టు ఇంతవరకు ఆయనపై అభియోగాలు నమోదు చేయలేదు. దాంతో విచారణ ప్రారంభం కాలేదు. విచారణ లేకుండా చిరకాలం పాటు కస్టడీలో ఉంచడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనంటూ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. నేరాలు రుజువు చేయకుండానే 11 ఏళ్ల పాటు జైలులో ఉంచడం ఏమిటని అతని తరఫు న్యాయవాది షోయబ్‌ అలం ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది విశాల్‌ మేఘవాల్‌ సమాధానం ఇస్తూ నిందితుడు దాదాపు 15 ఏళ్లపాటు పరారీలో ఉన్నాడని, అనంతరం దొరకడంతో కస్టడీలోకి తీసుకున్నారని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ 2010 నుంచి కస్టడీలోనే ఉన్నా ఎందుకు అభియోగాలు నమోదు చేయలేదని ప్రశ్నించింది. ‘‘సత్వర విచారణ పొందే హక్కు అతనికి ఉంది. శిక్షించండి లేదంటే విడిచిపెట్టండి దానితో మాకు సంబంధం లేదు. కనీసం విచారణ జరపండి. విచారణ లేకుండా దీర్ఘకాలంపాటు కస్టడీలో ఉంచకూడదు’’ అని స్పష్టం చేసింది. దీనిపై మేఘవాల్‌ సమాధానం ఇస్తూ ఇదే కేసులో సహ నిందితుడైన అబ్దుల్‌ కరీం తుండా గాజియాబాద్‌ జైలులో ఉన్నాడని, అందుకే ఆలస్యం జరుగుతోందని చెప్పారు. అలాంటప్పుడు రెండు కేసులను విడగొట్టి విచారణ జరపాలని ధర్మాసనం తెలిపింది. 2010లోనే ఆయనపై పోలీసులు వివిధ చట్టాల కింద 8,000 పేజీల అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని