
Vaccine certificate: వ్యాక్సిన్ సర్టిఫికెట్ గుర్తింపునకు 110 దేశాలు అంగీకారం!
కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి
దిల్లీ: భారత్‌లో వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరి వివరాలను కొవిన్ పోర్టల్‌లో నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ పొందినట్లు కొవిన్ నుంచి ధ్రువపత్రం కూడా పొందవచ్చు. ఇలా మనదేశంలో ఇస్తోన్న వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను గుర్తించేందుకు ఇప్పటివరకు 110 దేశాలు భారత్‌తో పరస్పర అంగీకారం కుదుర్చుకున్నట్లు కేంద్రప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరిన్ని దేశాలు ఈ ధ్రువపత్రాన్ని గుర్తించేందుకు వాటితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపాయి. వీటివల్ల ఉన్నతవిద్య, వ్యాపారం, పర్యటన కోసం విదేశాలకు రాకపోకలను సాగించే భారతీయులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడ్డాయి.
దేశీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్‌లతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన వ్యాక్సిన్‌లను పొందిన వారికి ఇచ్చే వ్యాక్సిన్ ధ్రువపత్రాన్ని గుర్తించేందుకు ఇప్పటివరకు 110 దేశాలతో భారత్‌తో పరస్పర అంగీకరించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే, మరికొన్ని దేశాలు ఈ అంగీకారం చేసుకోనప్పటికీ భారత్‌లో గుర్తింపు పొందిన వ్యాక్సిన్‌లను తీసుకున్న వారిని తమ దేశంలోని అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. ఇక ఈ ఒప్పందం ఉన్న దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కూడా క్వారంటైన్ నిబంధనలు అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. భారత్ నుంచి విదేశాలను ప్రయాణించే వారు మాత్రం కొవిన్ పోర్టల్ నుంచి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.
ఇదిలాఉంటే, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌కు భారత్‌తో పరస్పరం అంగీకారం తెలిపిన దేశాల్లో కెనడా, అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, బెల్జియం, ఐర్లాండ్, నెదర్లాండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్, స్వీడెన్, బ్రెజిల్, రష్యా, కువైట్, ఒమన్, యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్‌తోపాటు మొత్తం 110 దేశాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటికితోడు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పరస్పర గుర్తింపు కోసం మిగతా దేశాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.