Vaccination: 188 కోట్ల డోసులు అవసరం..!

దేశవ్యాప్తంగా అందరికీ (18ఏళ్ల పైబడిన) కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు 188 కోట్ల డోసులు అవసరమవుతాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Published : 20 Jul 2021 23:03 IST

డిసెంబర్‌ నాటికి అందుబాటులో ఉంటాయన్న కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: దేశవ్యాప్తంగా అందరికీ (18ఏళ్ల పైబడిన) కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు 188 కోట్ల డోసులు అవసరమవుతాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో 18ఏళ్ల వయసు పైబడిన వారు దాదాపు 94కోట్ల మంది ఉండగా వారికి రెండు డోసుల్లో ఇవ్వడానికి ఈ మొత్తం (188 కోట్ల డోసులు) అవసరం అవుతాయని అంచనా వేసినట్లు తెలిపింది. అయితే, ఒకవేళ సింగిల్‌ డోసు టీకాలు అందుబాటులోకి వస్తే ఈసంఖ్య తగ్గే అవకాశం ఉందని చెప్పింది. దేశంలో అందరికీ వ్యాక్సిన్‌ అందించేందుకు సరిపడా డోసుల ఉత్పత్తి సామర్థ్యం మన సంస్థలకు ఉందా అని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

దేశంలో ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్‌ చివరి నాటికి దాదాపు 187 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ పవార్‌ పేర్కొన్నారు. వీటితోపాటు మరికొన్ని వ్యాక్సిన్‌లు ప్రయోగాల దశలో ఉన్నాయని.. వాటికి కూడా అనుమతి వస్తే మరిన్ని డోసులు అందుబాటులో ఉంటాయన్నారు. ఇక దేశంలో తయారవుతోన్న టీకా ఒక్కో డోసుకు కొవిషీల్డ్‌-రూ.600, కొవాగ్జిన్‌-రూ.1200, స్పుత్నిక్‌-రూ.948 చొప్పున ప్రైవేటు సంస్థలు సేకరిస్తున్నాయని వెల్లడించారు.

కొవాగ్జిన్‌.. నెలకు 5.8కోట్ల డోసులు

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ తయారు చేస్తోన్న సంస్థలు వాటి ఉత్పత్తి వేగాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన ఆరు నెలల్లో (జులై 16నాటికి) భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తోన్న కొవాగ్జిన్‌ టీకా 5.45కోట్ల డోసులు ప్రభుత్వానికి అందాయని పేర్కొంది. జులై నాటికి వీటి సంఖ్య 8కోట్లకు చేరుతుందని.. అంతేకాకుండా త్వరలోనే నెలకు 5.8కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యానికి భారత్‌ బయోటెక్‌ చేరుకుంటుందని తెలిపింది. ఇలా సీరం ఇన్‌స్టిట్యూట్‌ నెలకు సరాసరి 11కోట్ల డోసులు, భారత్‌ బయోటెక్‌ 2.5కోట్ల డోసులను ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని