Container Hospitals: ఆసియాలోనే తొలిసారిగా.. భారత్‌లో ‘కంటైనర్‌ ఆధారిత’ ఆస్పత్రులు!

దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని అధిగమించేందుకు ‘కంటైనర్‌ ఆధారిత’ మొబైల్‌ ఆస్పత్రులను రూపొందిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు.

Published : 26 Oct 2021 19:55 IST

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడి

దిల్లీ: దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని అధిగమించేందుకు ‘కంటైనర్‌ ఆధారిత’ మొబైల్‌ ఆస్పత్రులను రూపొందిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు. హెల్త్‌ ఎమర్జెన్సీ సమయంలో విమాన, రైళ్ల ద్వారా వీటిని దేశంలో ఎక్కడికైనా తరలించే వీలుంటుందన్నారు. ఆయుష్మాన్‌ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కంటైనర్‌ ఆధారిత మొబైల్‌ ఆసుపత్రులను అందుబాటులో ఉంచనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా..

‘కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ మౌలిక సదుపాయాల కల్పన పథకంతో పేద ప్రజలకు 134 రకాల పరీక్షలను ఉచితంగా అందించనున్నాం. జిల్లా స్థాయిలో వీటిని ఏర్పాటు చేస్తాం. వీటికితోడు 100 పడకలతో కూడిన రెండు కంటైనర్‌ ఆధారిత ఆస్పత్రులను కూడా సిద్ధం చేస్తున్నాం. వీటిలో ఒకదాన్ని దిల్లీ, మరొకటి చెన్నై నగరంలో అందుబాటులో ఉంచుతాం. ఈ ఆస్పత్రులను రైళ్లు, విమానాల ద్వారా దేశంలో ఎక్కడికైనా తరలించవచ్చు. తద్వారా దేశంలో ఎక్కడైనా ఆరోగ్య అత్యవసరస్థితి ఏర్పడితే వేగంగా వైద్య సేవలు అందించేందుకు వీలుంటుంది’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు. కంటైనర్‌ ఆధారిత మొబైల్‌ ఆస్పత్రులను రూపొందించడం ఆసియాలోనే తొలిసారి అని అన్నారు. ప్రజలందరికీ తక్కువ ధరలో నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.

ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య కార్యక్రమం ప్రాముఖ్యతను మరోసారి వివరించిన కేంద్ర మంత్రి.. దేశంలో లక్షా 50వేల వెల్‌నెస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటిలో ఇప్పటికే 79వేల కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ సందర్భంగా దేశంలో ప్రతి జిల్లాకు కనీసం ఒక మెడికల్‌ కాలేజీ ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని