Omicron: భారత్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు: కేంద్రం

యావత్‌ ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ భారత్‌లో వెలుగు చూసింది. ఈ వేరియంట్‌కు సంబంధించి దేశంలో రెండు కేసుల్ని.....

Updated : 02 Dec 2021 21:24 IST

దిల్లీ: యావత్‌ ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ భారత్‌లోనూ వెలుగు చూసింది. ఈ వేరియంట్‌ కేసుల్ని కర్ణాటకలో గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీరిలో ఆఫ్రికా నుంచి వచ్చినవారు ఒకరు కాగా.. మరొకరు కర్ణాటకకు చెందినవారే ఉండటం గమనార్హం. ఒకరి వయసు 66ఏళ్లు కాగా.. మరొకరి వయసు 46 ఏళ్లు. అయితే, గోప్యతను దృష్టిలో ఉంచుకొని వారి పేర్లను వెల్లడించడం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. కర్ణాటకకు వచ్చిన వీరిద్దరికీ తొలుత కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఆ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ విశ్లేషణ కోసం పంపించారు.. తాజాగా వారిద్దరిలో ఒమిక్రాన్‌ ఉన్నట్టు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జోనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) నిర్ధారించింది. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించామనీ, వారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది.

ఆందోళన వద్దు.. జాగ్రత్తలు మరవొద్దు!

ఒమిక్రాన్‌ వెలుగుచూసిన ఇద్దరిలోనూ తీవ్రమైన లక్షణాలేమీ కనిపించలేదని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టంచేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవగాహన, అప్రమత్తత అత్యవసరమన్నారు. మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం మరవొద్దని విజ్ఞప్తి చేశారు. అందరూ తప్పనిసరిగా రెండు డోసుల టీకా తీసుకోవాలని కోరారు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం 37 ప్రయోగ శాలలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఒమిక్రాన్‌ ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీ-పీసీఆర్‌ తప్పనిసరి చేసినట్టు తెలిపారు. ఈ పరీక్షల్లో పాజిటివ్‌ వస్తే ప్రత్యేక చికిత్సకు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినా సరే వారం రోజుల పాటు క్వారంటైన్‌లోనే ఉంచనున్నట్టు తెలిపారు. 

29 దేశాలకు వ్యాప్తి: కేంద్రం

ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగు చూసిన ఈ వేరియంట్ ఇప్పటికే 29 దేశాలకు విస్తరించిందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 373 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడగా.. బోట్స్‌వానాలో 19, నెదర్లాండ్స్‌ 16, హాంగ్‌కాంగ్‌ 7, ఇజ్రాయిల్‌ 2, బెల్జియం 2, యూకే 32, జర్మనీ 10, ఆస్ట్రేలియా 8, ఇటలీ 4, డెన్మార్క్‌ 6, ఆస్ట్రియా 4, కెనడా 7, స్వీడెన్‌ 4, స్విట్జర్లాండ్‌ 3, స్పెయిన్‌ 2, పోర్చుగల్‌ 13, జపాన్‌ 2, ఫ్రాన్స్‌ 1, ఘనా 33, దక్షిణ కొరియా 3, నైజీరియా 3, బ్రెజిల్‌ 2, నార్వే 2, అమెరికా, సౌదీ అరేబియా, ఐర్లాండ్‌ యూఏఈలలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని