Philippines: ఫిలిప్పీన్స్​లో తుపాను బీభత్సం.. 23 మంది మృతి

ఫిలిప్పీన్స్​లో ‘రాయ్‌’ తుపాను బీభత్సం సృష్టించింది. పెనుగాలులతో విరుచుకుపడి దేశం మొత్తాన్ని అంధకారంలోకి నెట్టింది......

Updated : 18 Dec 2021 18:52 IST

మనీలా: ఫిలిప్పీన్స్​లో ‘రాయ్‌’ తుపాను బీభత్సం సృష్టించింది. పెనుగాలులతో విరుచుకుపడి దేశం మొత్తాన్ని అంధకారంలోకి నెట్టింది. తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలు, చెట్లు విరిగిపడటంతో దేశవ్యాప్తంగా 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. అనేక ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలిపారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సమాచార, రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా సెంట్రల్​ ఫిలిప్పీన్స్​లో తుపాను ప్రభావం అధికంగా ఉంది. తమ రాష్ట్రం పూర్తిగా నేలమట్టమైందని డినాగాట్​ ఐలాడ్స్​ ప్రావిన్స్​ గవర్నర్​ బగావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆహారం, మంచినీళ్లు, తాత్కాలిక షెడ్లు, పరిశుభ్రత కిట్లు, మందులు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

దక్షిణ, కేంద్ర ఫిలిప్పీన్స్​లోని రాష్ట్రాలను అతలాకుతలం చేసిన రాయ్​ తుపాను శుక్రవారం రాత్రి తీరం దాటి దక్షిణ చైనా సముద్రం వైపు కదిలిందని అధికారులు వెల్లడించారు. తుపాను ధాటికి ద్వీపసమూహం దక్షిణ, మధ్య ప్రాంతాల్లోని 3లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని.. ముందస్తు చర్యలు చేపట్టటం వల్ల చాలా ప్రాణాలను రక్షించగలిగామని పేర్కొన్నారు. రాయ్​ తుపాను కారణంగా గంటకు 195-270 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. గాలుల ధాటికి భారీ వృక్షాలు నెలకొరిగాయని, చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన కొద్ది సంవత్సరాలలో ఎదురైన తుపాన్లలో తీవ్రమైనదిగా పేర్కొన్నారు. దేశంలోని ఆగ్నేయ తీరాన్ని తుపాను గత గురువారమే తాకినా.. ఇప్పటికీ మరణాలు, నష్టాన్ని అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో భారీ వృక్షాలు విరిగిపడి ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని