Corona: జనవరి 4న ప్రపంచ వ్యాప్తంగా 25 లక్షలకు పైగా కొత్త కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి చూపిస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో కూడా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మీడియాకు వివరాలు వెల్లడించింది. అలాగే ఇంతకుముందు రెండు డోసులుగా తీసుకున్న టీకానే ప్రికాషనరీ డోసు కింద తీసుకోవాలని పేర్కొంది. 

Published : 05 Jan 2022 23:54 IST

దేశంలో 8 రోజుల్లో 6 రెట్లు పెరిగిన కొత్త కేసులు

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి చూపిస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో కూడా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మీడియాకు వివరాలు వెల్లడించింది. అలాగే ఇంతకుముందు రెండు డోసులుగా తీసుకున్న టీకానే ప్రికాషనరీ డోసు కింద తీసుకోవాలని పేర్కొంది. 

జనవరి 4న 25.2 లక్షల కేసులు..

జనవరి 4న ప్రపంచ వ్యాప్తంగా 25.2 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి వెలుగుచూసిన దగ్గరి నుంచి ఈ స్థాయిలో కేసులు ఎప్పుడూ రాలేదు. జనవరి నాలుగుతో ముగిసిన వారంలో దాదాపు 65 శాతం కేసులు అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ నుంచే వచ్చాయని ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్‌లో గత 8 రోజుల్లో కరోనా కేసులు 6.3 రెట్లు పెరిగాయి. డిసెంబర్ 29న 0.79 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు జనవరి 5 నాటికి 5.03 శాతానికి పెరిగిందని పేర్కొంది. మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, దిల్లీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఝార్ఖండ్, గుజరాత్‌లో వైరస్ ఉద్ధృతి ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. దేశంలో 28 జిల్లాల్లో వారపు పాజిటివిటీ రేటు 10 శాతంపైనే ఉందని వెల్లడించింది. 

ప్రస్తుతం దేశంలో కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. ఇప్పటివరకు 147 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి టీకాలు అందిస్తున్నారు. దేశంలో 7.40 కోట్ల మంది ఆ వయస్సువారు టీకా తీసుకునేందుకు అర్హులని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే గతంలో రెండు డోసులుగా తీసుకున్న టీకానే ఇప్పుడు ప్రికాషనరీ డోసుగా ఇస్తామని వెల్లడించింది. కొవాగ్జిన్ తీసుకున్న వాళ్లకు కొవాగ్జిన్‌, కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నవారికి కొవిషీల్డ్ ఇవ్వనున్నట్లు చెప్పింది. 

నాలుగు గంటల్లో ఒమిక్రాన్ గుర్తింపు..

‘ఒమిక్రాన్ వేరియంట్ నగరాల్లో విస్తరిస్తోన్న ప్రధాన వేరియంట్. దాని వ్యాప్తిని కట్టడిచేసేందుకు రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలి’ అని ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ విజ్ఞప్తి చేశారు. టాటా ఎండీ, ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో ఒమిక్రాన్‌ను గుర్తించే ఆర్టీపీసీఆర్ కిట్ అభివృద్ధి చేసినట్లు చెప్పారు. దీనిని డీసీజీఐ ఆమోదించిందన్నారు. ఇది నాలుగు గంటల్లో ఫలితం ఇస్తుందని చెప్పారు.  

దేశంలో కరోనావైరస్ మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. శరవేగంగా విస్తరిస్తూ.. తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రెండు రోజులుగా 30వేలకు పైగా నమోదయిన కొత్త కేసులు.. నేడు ఒక్కసారిగా 58 వేలకు చేరాయి. ముందురోజు కంటే 55 శాతం అధికంగా నమోదయ్యాయి. వేగంగా ప్రబలే లక్షణమున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ తాజా వ్యాప్తికి దోహదం చేస్తోంది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ కేసులు రెండు వేల మార్కు దాటేశాయి. భారత్‌లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, వచ్చే రెండు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని