Published : 10 Dec 2021 23:46 IST

Journalists: జర్నలిస్టులపై పెరిగిన నిర్బంధాలు.. చైనా టాప్‌..!

కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌(CPJ) అంతర్జాతీయ నివేదిక

న్యూయార్క్‌: నిజాలను వెలికితీస్తూ వాటిని నిర్భయంగా ప్రపంచానికి చాటి చెప్పే జర్నలిస్టులపై పలు దేశాలు అణచివేతకు పాల్పడుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ఏటా ఇలాంటి ఘటనలు పెరుగుతూనే ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. పలు కారణాలతో ఏటా వందల మంది జైలుపాలు కావడంతోపాటు పదుల సంఖ్యలో జర్నలిస్టులు బలి అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్‌కు చెందిన కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌ (CPJ) నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 293 మంది జర్నలిస్టులు నిర్బంధానికి గురయ్యారు. వీరిలో అత్యధిక మందిని జైలుకు పంపించిన జాబితాలో మాత్రం చైనానే ముందుంది.

విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై వేధింపులు, అణచివేత చర్యలు చాలా దేశాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 280 మంది జర్నలిస్టులు వివిధ కారణాలతో నిర్బంధానికి గురికాగా ఈ ఏడాది ఆ సంఖ్య 293కు పెరిగినట్లు సీపీజే నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా కవరేజీలో ఉన్న 24 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోగా.. మరో 18 మంది ఇటువంటి ఘటనల్లోనే మృత్యువాతపడినట్లు తెలిపింది. ఈ ఏడాది జైలుకెళ్లిన మొత్తం జర్నలిస్టుల్లో 50మంది కేవలం చైనాలోనే ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక జర్నలిస్టులను జైలుకు పంపుతోన్న దేశాల్లో చైనా వరుసగా మూడోసారి తొలిస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో ఉన్న మయన్మార్‌లో 26మంది మీడియా ప్రతినిధులు జైలుపాలయ్యారు. ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి 1నుంచి అక్కడ మొదలైన సైనిక పాలనలో ఈ సంఖ్య మరింత పెరిగింది. ఈ ఏడాది ఈజిప్టులో 25, వియత్నాంలో 23, బెలారస్‌లో 19 మంది జర్నలిస్టులు నిర్బంధానికి గురయ్యారు.

జర్నలిస్టుల నిర్బంధిస్తోన్న దేశాలు.. అందుకు భిన్న కారణాలను చెబుతున్నాయి. అయితే స్వేచ్ఛాయుత వాతావరణంలో రిపోర్టింగ్‌ చేసే వారినే కొన్ని ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు సీపీజే నివేదిక అభిప్రాయపడింది. ఇదిలాఉంటే, జర్నలిస్టులను నిర్బంధించడం చైనాకు కొత్తేమి కాదని అంతర్జాతీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. చైనాలో కొవిడ్‌ గురించి తొలిసారి బాహ్య ప్రపంచానికి తెలియజెప్పిన ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ ఝాంగ్‌ ఝాన్‌ను గతేడాది మే నెలలో చైనా అధికారులు అరెస్టు చేశారు. ఆ కేసులో ఆమెకు నాలుగేళ్ల శిక్ష పడింది. అయితే, ఈసారి హాంకాంగ్‌లోనూ మీడియా ప్రతినిధుల అరెస్టుల పర్వం కొనసాగింది. తొలిసారి అక్కడ ఎనిమిది ప్రముఖ జర్నలిస్టులను అరెస్టు చేశారు. అక్కడి యాపిల్‌ డైలీ వ్యవస్థాపకుడు జిమ్మీ లయ్‌తోపాటు మరికొందరు మీడియా ప్రముఖులు కూడా నిర్బంధించిన విషయం తెలిసిందే.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్