Biplab Deb: త్రిపుర సీఎంపై హత్యాయత్నం.. కారుతో దూసుకొచ్చిన ఆగంతకులు!

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌పై హత్యాయత్నం జరిగింది. ఆయనను కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నించగా.. సీఎం అప్రమత్తతతో ప్రమాదం తప్పింది.

Published : 07 Aug 2021 13:25 IST

అగర్తల: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌పై హత్యాయత్నం జరిగింది. ఆయనను కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నించగా.. సీఎం అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బిప్లవ్‌ దేవ్‌ గురువారం సాయంత్రం వాకింగ్‌ చేసేందుకు బయటకు వచ్చారు. తన అధికారిక నివాసానికి సమీపంలో సీఎం వాకింగ్‌ చేస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు కారు నడుపుకొంటూ భద్రతా వలయంలోకి దూసుకొచ్చారు. వాహనాన్ని గమనించిన ముఖ్యమంత్రి.. వెంటనే పక్కకు జరగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సీఎం భద్రతాసిబ్బంది ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. కారును ఆపేందుకు సెక్యూరిటీ ప్రయత్నించినప్పటికీ వారు వేగంగా వెళ్లిపోయారు.

ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం అర్ధరాత్రి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు సీఎంపై దాడికి ఎందుకు ప్రయత్నించారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని