Sedition: ఆరేళ్లలో 326 రాజద్రోహం కేసులు!

గడిచిన ఆరేళ్లలో దేశవ్యాప్తంగా 326 రాజద్రోహం కేసులు నమోదైనట్లు కేంద్ర హోంశాఖ తాజా నివేదిక వెల్లడించింది.

Published : 18 Jul 2021 20:21 IST

అస్సాంలోనే అత్యధికంగా 54 కేసులు నమోదు

దిల్లీ: స్వాతంత్య్రోద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిషర్లు తీసుకొచ్చిన రాజద్రోహ చట్టం అవసరం ఇప్పటికీ ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఈ చట్టం మరోసారి చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గడిచిన ఆరేళ్లలో దేశవ్యాప్తంగా 326 రాజద్రోహం కేసులు నమోదైనట్లు కేంద్ర హోంశాఖ తాజా నివేదిక వెల్లడించింది. వీటిలో అత్యధికంగా అస్సాంలోనే 54 కేసులు నమోదయ్యాయి. అయితే, ఆరేళ్లలో ఇన్ని కేసులు నమోదైనప్పటికీ.. కేవలం ఆరు కేసుల్లోనే శిక్ష ఖరారు కావడం గమనార్హం.

కేంద్ర హోంశాఖ సమాచారం ప్రకారం, 2014 -2019 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా రాజద్రోహం చట్టం కింద 326 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 141 కేసుల్లోనే ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ ఆరు సంవత్సరాల కాలంలో కేలవం ఆరుగురు మాత్రమే దోషులుగా తేలారు. ఇక మొత్తం కేసుల్లో 54 కేసులు అస్సాంలోనే నమోదుకాగా వీటిలో 26 కేసుల్లో ఛార్జిషీట్‌ సమర్పించారు. వీటిలో 25కేసుల్లో విచారణ పూర్తయినప్పటికీ ఏ ఒక్క కేసులోనూ నేరారోపణ రుజువు కాకపోవడం గమనార్హం.

2019లోనే అధికం..

గడిచిన ఆరేళ్లలో ఝార్ఖండ్‌లో 40కేసులు, హరియాణాలో 31, బిహార్‌, జమ్మూ కశ్మీర్‌, కేరళ రాష్ట్రాల్లో 25చొప్పున రాజద్రోహ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 22, ఉత్తర్‌ప్రదేశ్‌ 17, పశ్చిమబెంగాల్‌లో ఎనిమిది, దిల్లీలో నాలుగు, మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఇక సంవత్సరం వారీగా చూస్తే గత ఆరేళ్లలో నమోదైన కేసుల్లో కేవలం 2019లోనే 93 కేసులు నమోదయ్యాయి. 2015లో కేవలం 30 నమోదుకాగా, 2016లో 35, 2017లో 51, 2018లో 70 రాజద్రోహ కేసులు నమోదయ్యాయి. 2020 నాటి సమాచారాన్ని కేంద్ర హోంశాఖ విశ్లేషించాల్సి ఉంది.

ఇక దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తికావస్తున్న సమయంలోనూ రాజద్రోహ చట్టాన్ని (Section 124 A) కొనసాగించాల్సిన అవసరం ఉందా? అని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జవాబుదారీతనం లేని కార్యనిర్వాహక వ్యవస్థ చేతుల్లో ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న తీరుపట్ల చీఫ్‌ జస్టిస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సెక్షన్‌ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ విశ్రాంత సైనికాధికారి మేజర్‌ జనరల్‌ (రిటైర్డు) ఎస్‌.జి. ఒంబాట్కెరె దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్‌ రమణ, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌ల ధర్మాసనం జులై 15 పరిశీలించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఇదిలాఉంటే, భారత శిక్షాస్మృతిలోని 124-ఎ సెక్షన్‌ ఈ రాజద్రోహం గురించి చెబుతుంది. మాటల ద్వారాగానీ, రాతల ద్వారాగానీ, సంకేతాల ద్వారాగానీ, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా... ఎవరైనా చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై అసంతృప్తిని పోగు చేసినా, రెచ్చగొట్టినా, ధిక్కరించినా, శత్రుత్వ భావన కల్గించినా లేక అందుకు ప్రయత్నించినా అది రాజద్రోహమే. ఇది నాన్‌బెయిలబుల్‌ నేరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని