Omicron : 422కుచేరిన ఒమిక్రాన్‌ కేసులు.. ఎంత మంది కోలుకున్నారంటే..?

దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వేగంగా విస్తరిస్తోంది. ఇది ఇప్పటికే 17 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు పాకింది. ఇప్పటి వరకూ దేశంలో నమోదైన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య

Updated : 26 Dec 2021 11:11 IST

దిల్లీ : దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వేగంగా విస్తరిస్తోంది. ఇది ఇప్పటికే 17 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు పాకింది. ఇప్పటి వరకూ దేశంలో నమోదైన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 422కు చేరింది.  వీరిలో 130 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇక 108 కేసులతో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉండగా.. దిల్లీ 79 కేసులతో ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతోంది.

⇒ ఇక దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,45,455 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 6,987 కేసులు వెలుగులోకి వచ్చాయి.

నిన్న 162 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 4,79,682కి చేరింది.

గడిచిన 24 గంటల్లో 7,091 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 3.42 కోట్లకు చేరింది. దీంతో రికవరీ రేటు 98.40 శాతానికి పెరిగింది.

ప్రస్తుతం దేశంలో 76,766 క్రియాశీల కేసులు ఉండగా.. ఆ రేటు 0.22 శాతానికి పడిపోయింది.

ఇక నిన్న 32,90,766 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 141 కోట్లు దాటింది.

ఒమిక్రాన్‌ విస్తృతి నేపథ్యంలో దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ నిన్న తెలిపిన విషయం తెలిసిందే.  60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి వైద్యుల సలహాపై ‘ముందు జాగ్రత్త (ప్రికాషన్‌) డోసు’ టీకా అందించనున్నామని, ఆరోగ్య విభాగ సిబ్బందికి దీన్ని జనవరి 10 నుంచి వేయనున్నట్లు ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని