Corona: ముంబయిలో కొవిడ్‌ విజృంభణ.. ఒక్కరోజే 47శాతం పెరిగిన కేసులు

దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. తగ్గినట్లే తగ్గిన కొవిడ్‌ కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి......

Published : 31 Dec 2021 22:09 IST

ముంబయి: దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. తగ్గినట్లే తగ్గిన కొవిడ్‌ కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. వాణిజ్య రాజధాని ముంబయిలో వైరస్‌ కోరలు చాస్తోంది. కొన్ని నెలలపాటు వందలోపే నమోదైన కేసులు ప్రస్తుతం భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో స్థానికంగా 5,428 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటి కేసులతో పోలిస్తే ఇవి ఏకంగా 47 శాతం అధికం కావడం గమనార్హం. బుధవారం కేసుల (2510)తో పోలిస్తే నిన్న అత్యధికంగా 3,671 నమోదవగా.. శుక్రవారం ఏకంగా 47 శాతం అధిక కేసులు వెలుగుచూడటం భయాందోళనకు గురిచేస్తోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా 8067 కేసులు బయటపడగా.. నిన్నటికంటే ఇవి 50శాతం అధికం కావడం వైరస్‌ ఉద్ధృతికి అద్దంపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా తాజాగా 8 మంది మృతిచెందారు.

కొత్త వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గురువారం రాష్ట్ర కొవిడ్ టాస్క్‌ఫోర్స్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహమ్మారి పరిస్థితులు, తీసుకోవాల్సిన పరిష్కార చర్యలపై చర్చించారు. ముంబయిలో భారీ ఎత్తున కేసులు బయటపడుతుండటంతో బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అప్రమత్తమైంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు తాజాగా మరోసారి 24 వార్డు స్థాయి వార్ రూమ్‌లను యాక్టివేట్‌ చేసింది. బాధితుల ట్రాకింగ్‌, ఆసుపత్రుల్లో చేరికలు, ఆక్సిజన్, మందుల అవసరాలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఇవి పర్యవేక్షిస్తాయి. ఇదిలా ఉంటే దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 1300 దాటగా.. వాటిలో అత్యధికంగా ముంబయిలోనే నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని