Corona: దేశంలో 67శాతం మందిలో యాంటీబాడీలు!

దేశ జనాభాలో 67శాతం మందిలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Updated : 20 Jul 2021 18:49 IST

ఐసీఎంఆర్‌ సెరో సర్వేలో వెల్లడి

దిల్లీ: దేశ జనాభాలో 67శాతం మందిలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే మరో 40కోట్ల మందికి ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పొంచివుందని హెచ్చరించింది. భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) జాతీయ స్థాయిలో చేపట్టిన నాలుగో సెరో సర్వే వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

50శాతం పిల్లలకు కరోనా..?

దేశంలో కరోనా వైరస్‌ ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సెరో సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జూన్‌-జులై మధ్యకాలంలో భారత వైద్య పరిశోధనా మండలి జాతీయ స్థాయిలో నాలుగో సెరో సర్వే చేపట్టింది. ఇందుకోసం ఈసారి చిన్నారులను కూడా పరిగణలోకి తీసుకుంది. ఇలా దేశంలో 6ఏళ్ల వయసుపైబడిన 67.6శాతం మందిలో కొవిడ్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 6-17ఏళ్ల వయసున్న వారిలో 50శాతం కొవిడ్‌ ప్రభావానికి గురైనట్లు తాజా సర్వేలో తేలింది. ఇక 45-60ఏళ్ల వయసున్న వారిలో అత్యధికంగా (77.6శాతం) యాంటీబాడీలు ఉండగా.. 60ఏళ్లకు పైబడిన వారిలో ఇవి 76శాతం ఉన్నట్లు వెల్లడైంది.

85శాతం ఆరోగ్య కార్యకర్తల్లో..

దేశవ్యాప్తంగా జరిపిన నాలుగో సెరో సర్వేను 21రాష్ట్రాల్లోని 70జిల్లాల్లో చేపట్టారు. ఇందులో మొత్తం 28,975 మంది సాధారణ ప్రజలు పాల్గొనగా.. 7252 మంది ఆరోగ్య సంరక్షణ వర్కర్లను పరీక్షించారు. ప్రతి జిల్లా నుంచి కనీసం 100మంది ఆరోగ్య కార్యకర్తలు ఉండేట్లు చూసుకున్నారు. ఇలా సర్వేలో పాల్గొన్న మొత్తం ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో 85శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు ప్రభుత్వం పేర్కొంది. వీరిలో 90శాతం మంది వ్యాక్సిన్‌ పొందినవారేనని తెలిపింది.

ప్రాథమిక పాఠశాలలు తెరుచుకోవచ్చు..

ప్రాథమిక పాఠశాలలు తెరవడంపైనా కేంద్ర ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది. వైరస్‌ గ్రాహకాలు (Ace receptors) చిన్నారుల్లో తక్కువగా ఉన్న కారణంగా వారిలో ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి తక్కువగా ఉండనున్నట్లు ఐసీఎంఆర్‌ అభిప్రాయపడింది. అందుచేత ఉపాధ్యాయులు, సిబ్బంది పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకుంటే ప్రాథమిక పాఠశాలలు తెరచుకోవచ్చని సూచించింది. ఇక భారత్‌లో ఎక్కువ మంది చిన్నారులు వైరస్‌ను ఎదుర్కోవడం వల్ల వారిలో సహజసిద్ధమైన రోగనిరోధక శక్తి వృద్ధి చెందిందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా పేర్కొన్నారు. ఎయిమ్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలోనూ సీరో పాజిటివిటీ రేటు పెద్దల కంటే పిల్లల్లోనే ఎక్కువగా ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

సమూహాలకు దూరంగా ఉండాల్సిందే..

దేశంలో మూడో వంతు మందిలో ఇప్పటికే కొవిడ్‌ యాంటీబాడీలు వృద్ధి చెందినప్పటికీ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరో 40కోట్ల మందికి వైరస్‌ బారినపడే ముప్పు ఉన్న నేపథ్యంలో సామాజిక, మతపరమైన, రాజకీయ సమావేశాలను నిర్వహించవద్దని హెచ్చరించింది. అవసరం లేని ప్రయాణాలకూ ప్రజలు దూరంగా ఉండాలని తెలిపింది. కేవలం రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకున్న వారు మాత్రమే ప్రయాణాలు చేయవచ్చని సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని