Citizenship: భారత పౌరసత్వం కోసందరఖాస్తులు.. 7306 మందిపాకిస్థానీలే..!

భారత పౌరసత్వం కోసం వివిధ దేశాల నుంచి ఈ ఏడాది డిసెంబర్‌ 14నాటికి 10వేలకుపైగా దరఖాస్తులు రాగా వాటిలో 7306 మంది పాకిస్థానీయులేనని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

Published : 23 Dec 2021 01:48 IST

కేంద్ర హోంశాఖ వెల్లడి

దిల్లీ: భారత పౌరసత్వం కోసం వివిధ దేశాల నుంచి ఈ ఏడాది డిసెంబర్‌ 14నాటికి 10వేలకుపైగా దరఖాస్తులు రాగా వాటిలో 7306 మంది పాకిస్థానీయులేనని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అయితే, వీటిలో 70శాతం దరఖాస్తులు ప్రస్తుతం పెండింగులోనే ఉన్నాయని స్పష్టం చేసింది. భారత పౌరసత్వం కోరుతూ వచ్చిన దరఖాస్తు వివరాలను తెలియజేయాలని పార్లమెంట్‌ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ సమాధానమిచ్చింది. అంతేకాకుండా గడిచిన నాలుగేళ్లలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ దేశాలకు చెందిన 3117 మంది మైనార్టీలకు భారత పౌరసత్వ హోదా కల్పించినట్లు మరో ప్రశ్నకు బదులుగా తెలిపింది.

భారత పౌరసత్వాన్ని కోరుతూ వచ్చిన దరఖాస్తులపై సమాచారం ఇవ్వాలని ఎంపీ అబ్దుల్‌ వాహబ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ సమాధానమిచ్చారు. డిసెంబర్‌ 14 నాటికి 10,635 దరఖాస్తులు రాగా వాటిలో 7306 మంది పాకిస్థానీయులవేనని వెల్లడించారు. అఫ్గాన్‌ నుంచి 1152, శ్రీలంక, అమెరికాల నుంచి 223, నేపాల్‌ నుంచి 189, బంగ్లాదేశ్‌ నుంచి 161, ఇతర ప్రాంతాలనుంచి 428 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా భారత పౌరసత్వాన్ని కోరుతూ చైనా నుంచి 10 దరఖాస్తులు వచ్చినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ఇక పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లోని హిందూ, సిక్కు, జైన్‌, క్రిస్టియన్‌ మైనారిటీ వర్గాలకు చెందినవారి నుంచి భారత పౌరసత్వం కోరుతూ ఎన్ని దరఖాస్తులు వచ్చాయి..? వాటిలో ఎంతమందికి పౌరసత్వం ఇచ్చారని ఎంపీ కే.కేశవరావ్‌ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం బదులిచ్చింది. ఇలాంటివి గడిచిన నాలుగేళ్లలో 8244 దరఖాస్తులు రాగా వాటిలో 3117 మందికి పౌరసత్వం జారీచేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి వెల్లడించారు. ఇదిలాఉంటే, గత ఐదేళ్ల కాలంలో 6 లక్షల మందికిపైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్రం ఇటీవలే పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని