Afghanistan: అఫ్గాన్​లో 75శాతం మంది బాలికలు మళ్లీ బడిబాట!

అఫ్గానిస్థాన్​లో 75శాతం మంది బాలికలు తిరిగి పాఠశాలలకు హాజరవుతున్నట్లు తాలిబన్‌ తాత్కాలిక విదేశాంగ శాఖ మంత్రి ఆమిర్‌ ఖాన్‌ మట్టాఖి తెలిపారు. 

Published : 13 Nov 2021 23:59 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అనేకమంది బాలికలు చదువుకు దూరమయ్యారు. పాఠశాలలు మూసివేయడంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. అయితే అఫ్గానిస్థాన్​లో 75శాతం మంది బాలికలు తిరిగి పాఠశాలలకు హాజరవుతున్నట్లు తాలిబన్‌ తాత్కాలిక విదేశాంగ శాఖ మంత్రి ఆమిర్‌ ఖాన్‌ మట్టాఖి తెలిపారు. అఫ్గాన్​లో బాలికల విద్యా హక్కుల పరిస్థితిపై ప్రశ్నకు బదులుగా ఆయన సమాధానమిచ్చారు. 

ఈ ఏడాది ఆగస్టులో అఫ్గాన్​ను ఆక్రమించుకున్న తాలిబన్లు పాఠశాలలను మూసివేయడంతో వేలాది మంది బాలికలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. అధికారం చేపట్టాక తాము మహిళల హక్కులు, వారి విద్యా హక్కులకు ఎలాంటి భంగం కలిగించబోమని తాలిబన్లు చెప్పినప్పటికీ.. ఇంతకాలం వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉండేవి. మహిళలు, బాలికల పట్ల వారు కఠినంగా వ్యవహరిస్తున్నారు. చదువుకోకుండా, పనులకు వెళ్లకుండా ఆంక్షలు విధిస్తున్నారు. అఫ్గాన్​లోని అన్ని ఉన్నత పాఠశాలలను ఇటీవలే తిరిగి ప్రారంభించింది విద్యాశాఖ. అయితే ఇది బాలురకేనని ఆదేశాల్లో పేర్కొంది. బాలికల ప్రస్తావన ఎక్కడా లేదు.

అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మాత్రం.. బాలికలు అతి త్వరలో పాఠశాలలకు హాజరవుతారని, వారికి చదువుచెప్పే మహిళా టీచర్లు కూడా విధులకు వస్తారని పేర్కొన్నారు. ఈ తరుణంలోనే బాలికలు ఇప్పటికే పాఠశాలలకు వెళుతున్నారని తాలిబన్లు చెప్పడం గమనార్హం. అంతకుముందు అఫ్గాన్​లో బాలికల పరిస్థితిపై యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు తిరిగి తెరవాలని సూచించింది. తాలిబన్లు బాలికలను పాఠశాలల్లో చదువుకునేందుకు అనుమతిస్తారో లేదో చూడాలని యూనిసెఫ్ ప్రతినిధి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని