Updated : 29 Dec 2021 10:52 IST

Covid Vaccine:12 ఆయుధాలతో.. కొవిడ్‌పై భారత్‌ పోరు..!

ఇప్పటికే అనుమతి పొందిన 8 టీకాలు, 4 ఔషధాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: కరోనా మహమ్మారి వెలుగు చూసి రెండేళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లతో ప్రపంచ దేశాలు వైరస్‌పై పోరాటం చేస్తున్నాయి. ఇటు భారత్‌ కూడా కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహాలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా తాజాగా మరో రెండు వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఇలా మొత్తంగా ఇప్పటివరకు వైరస్‌ను ఎదుర్కొనే 8 వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతి ఇవ్వగా మరో 4 చికిత్సా విధానాలకు ఆమోదం తెలిపింది. కొత్త వేరియంట్లతో కొవిడ్‌ మహమ్మారి సవాల్‌ విసురుతున్న వేళ.. భారత్‌ చెంత ఉన్న అస్త్రాలు ఇవే..

కొవిషీల్డ్‌: యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ సహకారంతో ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్‌ను భారత్‌లో కొవిషీల్డ్‌ పేరుతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేస్తోంది. స్పైక్‌ ప్రొటీన్‌ లక్ష్యంగా చేసుకొని ఈ వ్యాక్సిన్‌ పనిచేస్తుంది.

కొవాగ్జిన్‌: హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ రూపొందించిన స్వదేశీ వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌. భారత వైద్య పరిశోధనా మండలి (ICMR), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఇందుకోసం ఇన్‌యాక్టివేటెడ్‌ వైరస్‌ను వినియోగించి దీన్ని రూపొందించారు.

స్పుత్నిక్‌-వి: రష్యాకు చెందిన గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది. Ad5, Ad26 అనే రెండు అడినోవైరస్‌ల మిశ్రమంతో దీన్ని అభివృద్ధి చేశారు. స్వల్ప జలుబు, ఫ్లూ తరహా జబ్బులకు ఈ అడినో వైరస్‌లు కారణమవుతాయి.

జైకోవ్‌-డీ: డీఎన్‌ఏ ఆధారంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసింది. ఈ టీకాను మూడు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు ఎటువంటి సిరంజీలు అవసరం లేదు. సూది అవసరం లేని ఓ ప్రత్యేక అప్లికేటర్‌తో ఈ వ్యాక్సిన్‌ అందిస్తారు. వైరస్‌ జన్యుక్రమాన్ని మార్పు చేసిన బ్లూప్రింట్‌ జన్యుపదార్థాన్ని వ్యాక్సిన్‌ రూపంలో శరీరంలోకి పంపిస్తారు.

మోడెర్నా: అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ దీన్ని రూపొందించింది. రెండు డోసుల్లో తీసుకోవాల్సిన ఈ వ్యాక్సిన్‌ను మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ (mRNA) జెనెటిక్‌ కోడ్‌ సహాయంతో అభివృద్ధి చేశారు. అంటువ్యాధికి సంబంధించి ఏదైనా కరోనా వైరస్‌ శరీరంలోని ప్రవేశిస్తే వాటికి ఎదుర్కోవడానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని పెంపొందించేందు ఈ వైరల్‌ ప్రొటీన్‌ శిక్షణ ఇస్తుంది.

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌: అడినోవైరస్‌ వెక్టార్‌తో తయారు చేసిన సింగిల్‌ డోసు టీకా. అమెరికాకు చెందిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ దీన్ని రూపొందించింది. మార్పులు చేసిన చిన్న వైరస్‌ (కొవిడ్‌-19కు కారణమయ్యే వైరస్‌ కాదు) ఇందులో ఉంటుంది. దీన్ని వెక్టార్‌ వైరస్‌గా పరిగణిస్తారు. ఇది స్వయంగా పునరుత్పత్తి కాలేదు. అందుచేత దీనివల్ల ఎటువంటి హాని ఉండదు. రోగనిరోధక ప్రతిస్పందనలు ఉత్పత్తి చేసేలా శరీరంలోని కణాలకు సూచనలు ఇస్తుంది.

కార్బివాక్స్‌: హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఇ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. కొవిడ్‌కు కారణమయ్యే సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌కు చెందిన రెసిప్టార్‌ బైండింగ్‌ డొమైన్‌ (RBD) వర్షన్‌ ఇందులో ఉంటుంది. దీన్ని రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. హైపటైటిస్‌-బి వ్యాక్సిన్‌ మాదిరి సాంకేతికతతో దీన్ని రూపొందించారు.

కొవొవాక్స్‌: అమెరికాకు చెందిన నొవావాక్స్‌ దీన్ని రూపొందించింది. భారత్‌లో కొవొవాక్స్‌ పేరుతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా దీన్ని తయారు చేస్తోంది. వైరస్‌లోని శుద్ధి చేసిన భాగాలు ఉండే ఈ వ్యాక్సిన్‌ ఇమ్యూనిటీని పెంపొందించేందుకు దోహదం చేస్తుంది.

కొవిడ్ చికిత్సలో భాగంగా ఇప్పటి వరకు నాలుగు రకాల పద్ధతులకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ CDSCO ఆమోదం తెలిపింది.

ఇవీ చికిత్సా విధానాలు..

మొల్నుపిరవిర్: అమెరికా సంస్థ మెర్క్ తయారు చేసిన మొల్నుపిరవిర్ యాంటీవైరల్ ఔషధానికి అనుమతి లభించింది. ఈ ఔషధాన్ని భారత్‌లో దాదాపు 13 కంపెనీలు తయారు చేయనున్నాయి. వ్యాధి ముప్పు అధికంగా ఉన్నవారికి అత్యవసర వినియోగం కింద దీన్ని అందించనున్నారు.

టోసిలిజుమాబ్: ఈ ఔషధాన్ని స్విట్జర్లాండ్‌కు చెందిన రోచే సంస్థ తయారు చేసింది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగుల కోసం తయారు చేసిన ఈ ఔషధాన్ని కొవిడ్ బాధితులో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కొనేందుకు ఉపయోగించనున్నారు. సిప్లా సంస్థ భారత్‌లో దిగుమతి, సరఫరా చేయనుంది.

2-DG (2-deoxy-D-glucose): డీఆర్‌డీఓ (DRDO) సహకారంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. నోటి ద్వారా దీన్ని తీసుకోవాలి. Glycolysis పద్ధతి వైరస్ పెరుగుదలను నిరోధిస్తుంది.

REGEN-COV2 యాంటీబాడీ కాక్‌టెయిల్: Casirivimab, Imdevimab మోనోక్లోనల్ యాంటీబాడీల మిశ్రమంతో ఈ కాక్‌టెయిల్ యాంటీబాడీ చికిత్స అందిస్తారు. ముఖ్యంగా స్వల్ప నుంచి ఓ మాదిరి లక్షణాలున్న కొవిడ్ బాధితులకు ఇస్తారు. ఈ యాంటిబాడీలు ల్యాబ్‌లో కృత్రిమంగా చేసినవి. మానవ కణాల్లోకి ప్రవేశించకుండా వైరస్‌లోని స్పైక్ ప్రోటీన్‌ను అడ్డుకుంటాయి.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని