
ఒమిక్రాన్ కలవరం.. ఒకే కుటుంబంలో తొమ్మిది మంది కరోనా పాజిటివ్!
జైపూర్: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న వేళ రాజస్థాన్‌లో ఒకే కుటుంబంలో తొమ్మిది మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలడం గుబులు రేపుతోంది. ఇటీవల నలుగురు వ్యక్తులు దక్షిణాఫ్రికా నుంచి జైపూర్‌కు రాగా.. ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు వారికి పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆ కుటుంబంలో తొమ్మిది మందికి కొవిడ్ సోకినట్టు నిర్ధారించారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారిని రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఆర్యూహెచ్ఎస్)లో చేర్పించారు. ఆ కుటుంబంలో 14 మంది నుంచి శాంపిల్స్ సేకరించగా.. తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరోత్తమ్ శర్మ తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన నలుగురినీ కొవిడ్ నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌లో ఉంచినట్టు వివరించారు. మిగతా ఐదుగురిని హోం క్వారంటైన్లో ఉంచామన్నారు. వీరందరి శాంపిల్స్‌ని జైపూర్‌లోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపారు. రాజస్థాన్‌లో ప్రస్తుతం 213 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. వీటిలో ఒక్క జైపూర్‌లోనే 114 కేసులు ఉండటం గమనార్హం.
► Read latest National - International News and Telugu News